ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్
దుబాయ్: ఇటీవల అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో సత్తా చాటిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. అఫ్గాన్‌తో రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన గిల్ 238 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో మూడు స్థానాలు మెరుగుపరుచుకున్న గిల్ 791 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు.
విరాట్ కోహ్లి (768 పాయింట్లు), రోహిత్ శర్మ (754 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా... న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ (815 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా నుంచి కేఎల్ రాహుల్ (651 పాయింట్లు) 11వ స్థానానికి చేరగా... శ్రేయస్ అయ్యర్ (638 పాయింట్లు) 14వ ర్యాంక్‌లో ఉన్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ (682 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... భారత్ నుంచి అత్యుత్తమంగా కుల్దీప్ యాదవ్ (614 పాయింట్లు) ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
రూట్ 12వ సారి...
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్ స్థానానికి చేరాడు. సుదీర్ఘ కెరీర్‌లో రూట్ ‘టాప్’ ర్యాంక్‌కు చేరడం ఇది పన్నెండోసారి కావడం విశేషం. తాజాగా న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో బెన్ స్టోక్స్ స్థానంలో ఇంగ్లండ్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్... ఈ సిరీస్‌లో బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా రెండు స్థానాలు పురోగతి సాధించిన అతడు... 871 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకాడు.
ఇంగ్లండ్‌కే చెందిన హ్యారీ బ్రూక్ (866 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా... టీమిండియా నుంచి గిల్ (743 పాయింట్లు), యశస్వి జైస్వాల్ (733 పాయింట్లు) వరుసగా ఏడు, ఎనిమిది ర్యాంక్‌ల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 11 వికెట్లతో విజృంభించిన న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ (870 పాయింట్లు), భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరాడు. తద్వారా 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ‘టాప్’ ర్యాంక్ దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ నుంచి గతంలో జాక్ కొవీ (1947), రిచర్డ్ హాడ్లీ (1984–1990) మాత్రమే ఈ ఘనత సాధించారు.


