
ఫ్రాంచైజీ క్రికెట్‌కే ఓటేస్తున్న ఈతరం క్రికెటర్లు
లీగ్‌ల్లో ఆడేందుకు ‘సై’అంటున్న కుర్రాళ్లు
జాతీయ జట్టు కంటేఫ్రాంచైజీలకే ప్రాధాన్యం
పనిభారం నెపంతో దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు వెనకడుగు!
భారీ షాట్లకు పెట్టింది పేరైన కరీబియన్ వీరుడు నికోలస్ పూరన్ ముప్పై ఏళ్లు రాకముందే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 33 ఏళ్లకే మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్, స్టొయినిస్ వన్డే క్రికెట్‌కు దూరమయ్యారు.
ఈ నలుగురిలో మ్యాక్స్‌వెల్ తప్ప మిగిలిన ముగ్గురికి ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవు. మరికొంత కాలంగా ధాటిగా ఆడగల సత్తా ఉన్నవాళ్లే అయినా... ఇలా అంతర్జాతీయ క్రికెట్‌కు అర్ధాంతరంగా వీడ్కోలు పలకడం వెనక అసలు మతలబు మాత్రం లీగ్ క్రికెట్‌కు పెద్దపీట వేసేందుకే అనేది జగమెరిగిన సత్యం!
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో వివాదాల కారణంగా కరీబియన్ ఆటగాళ్లు మొదటి నుంచి విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్‌లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. జాతీయ జట్టు తరఫున అయితే ఆటతో పాటు బాధ్యత కూడా మోయాల్సి ఉంటుంది. అందుకు ప్రతిఫలంగా దక్కే మొత్తం కూడా చాలా తక్కువ.
మన దేశంలో రంజీ మ్యాచ్ ఆడే ఆటగాడికి దక్కే ఫీజు సైతం అందుకోని అంతర్జాతీయ క్రికెటర్లు బయట ఎందరో ఉన్నారు. దీంతో వారంతా ఫ్రాంచైజీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు నెలల పాటు కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లినట్లు వెళ్లి ఓ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయడమో... లేక బ్యాటింగ్‌లో కొన్ని మెరుపులు మెరిపించడంతోనో పని కానిస్తున్నారు! – సాక్షి క్రీడావిభాగం
అంతర్జాతీయ క్రికెట్‌లో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే ఒక ఆటగాడు తన జీవిత కాలాన్ని వెచ్చించాల్సిందే. అహర్నిశలు కృషి చేస్తే తప్ప ఆ స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. కఠోర శ్రమకు కాలం కూడా కలిసొస్తేనే ఫలితాలు సానుకూలంగా వస్తాయి. అలాంటిది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్న తర్వాత ఆటగాళ్లు ఆ విధులకు దూరంగా ఉండటానికి కారణాలు లేకపోలేదు. వెస్టిండీస్ బోర్డు విషయానికి వస్తే... వార్షిక కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజులు, ఆటగాళ్లకు సౌకర్యాలు, బకాయిలు ఇలా సవాలక్ష కారణాలతో ఆ దేశంలోని నాణ్యమైన ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడేందుకు విముఖత చూపుతున్నారు.
క్రిస్ గేల్ నుంచి మొదలుకొని కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, డారెన్ స్యామీ, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, హెట్‌మైర్, నికోలస్ పూరన్ ఇలా వెస్టిండీస్ స్టార్ ఆటగాళ్లంతా లీగ్‌లతోనే విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఏమూల లీగ్ క్రికెట్ జరుగుతున్నా అందులో ప్రముఖంగా కనిపించే ప్లేయర్లు కరీబియన్లే అనడంలో సందేహం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రమాదకర ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న పూరన్ 2016లో తొలిసారి జాతీయ జట్టుకు ఆడాడు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో వెస్టిండీస్ తరఫున 61 వన్డేలాడిన అతడు 1983 పరుగులు చేశాడు.
106 టి20 మ్యాచ్‌ల్లో 2275 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడగల సామర్థ్యం... ఎలాంటి స్థితిలో అయినా భారీ షాట్లు కొట్టగల నైపుణ్యం అతడికి మంచి ‘ఫినిషర్’అనే గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే కెరీర్ ఆరంభం నుంచి కేవలం వన్డే, టి20లపైనే దృష్టి పెట్టిన పూరన్... సుదీర్ఘ ఫార్మాట్ జోలికి పోలేదు. 2023లో చివరి వన్డే మ్యాచ్ ఆడిన అతడు... గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై ఆఖరి టి20 మ్యాచ్ ఆడాడు. విండీస్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన పూరన్... 29 ఏళ్లకే అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం వెనక ఫ్రాంచైజీ క్రికెట్‌లో చేసుకున్న ఒప్పందాలు కీలకపాత్ర పోషించాయి.
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పూరన్... వివిధ లీగ్‌ల్లో ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ చార్జర్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, బార్బడోస్ ట్రిడెంట్స్, డెక్కన్ గ్లాడియేటర్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, గయానా అమెజాన్ వారియర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్, ఖుల్నా టైటాన్స్, ముల్తాన్ సుల్తాన్స్ ఇలా లెక్కకు మిక్కిలి ఫ్రాంఛైజీలకు ప్రాతినిధ్యం వహించాడు గతేడాది పొట్టి ఫార్మాట్‌లో 170 సిక్స్‌లు బాది నయా రికార్డు సృష్టించిన పూరన్... ఐపీఎల్ 18వ సీజన్‌లో 40 సిక్స్‌లు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు.
క్లాసెన్ ఇదే దారిలో...
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్లతో రికార్డులు తిరగరాయడంలో కీలకపాత్ర పోషించిన దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ కూడా ఇటీవల మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 33 ఏళ్ల క్లాసెన్ దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టి20లు ఆడాడు. వన్డేల్లో 2141 పరుగులు చేసిన క్లాసెన్... పొట్టి ఫార్మాట్‌లో 1000 పరుగులు చేశాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల తెగువ... భారీ షాట్‌లతో ప్రత్యర్థి బౌలర్ల లయ దెబ్బతీయగల నేర్పు అతడి సొంతం.
కుటుంబంతో ఎక్కువ సమయం గడపడంతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లాసెన్ ప్రకటించినా... దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో డిమాండ్ ఉన్నప్పుడే మరింత డబ్బు చేసుకోవాలనే అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడనేది సుస్పష్టం. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ధాటిగా ఆడగల మేటి బ్యాటర్ అయిన క్లాసెన్‌కు విశ్వవ్యాప్తంగా లీగ్‌ల్లో మంచి గిరాకీ ఉంది.
వీళ్లు కూడా...
గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ... తాజాగా టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. వీరిద్దరూ ఇప్పుడు కేవలం వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కుర్రాళ్లకు అవకాశం కల్పించేందుకే అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించిన ఈ జోడీ... ఐపీఎల్‌లో మాత్రం అదరగొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన కోహ్లి... బెంగళూరు తొలిసారి చాంపియన్‌గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఇక ‘హిట్‌మ్యాన్’రోహిత్ ఇచ్చిన ఆరంభాలతోనే ముంబై జట్టు ‘ప్లే ఆఫ్స్’కు చేరగలిగింది. ఈ ఇద్దరూ మరి కొన్నేళ్లు ఐపీఎల్‌లో కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది. మార్టిన్ గప్టిల్, దిముత్ కరుణరత్నే, తమీమ్ ఇక్బాల్, మహ్ముదుల్లా ఇలా వివిధ దేశాలకు చెందిన పలువురు ప్లేయర్లు ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా... వారు లీగ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు.
వన్డేలకు మ్యాక్సీ ‘టాటా’...
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ మధ్యే వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని టి20లపై ఎక్కువ దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాక్సీ ప్రకటించినా... దీని వెనుక కూడా లీగ్‌ల హస్తం ఉంది. ఐపీఎల్‌లో ఒకదశలో అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడైన ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో కాస్త వెనుకబడి... పెట్టిన ధరకు న్యాయం చేయలేకపోయిన సందర్భాలే అధికం.
ఆసీస్ తరఫున 7 టెస్టుల్లో 339, 149 వన్డేల్లో 3990, 116 టి20ల్లో 2664 పరుగులు చేసిన 36 ఏళ్ల మ్యాక్స్‌వెల్... ఇకపై కేవలం పొట్టి ఫార్మాట్‌లో మాత్రమే ఆడనున్నాడు. ఆస్ట్రేలియా పేస్ ఆల్‌రౌండర్ స్టొయినిస్ కూడా ఈ ఏడాదే వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 18వ సీజన్‌లో తన మెరుపులతో అభిమానులను అలరించిన స్టొయినిస్... జాతీయ జట్టు తరఫున 71 వన్డేల్లో 1495, 74 టి20ల్లో 1245 పరుగులు చేశాడు.
వన్డేల్లో 48, టి20ల్లో 45 వికెట్లు సైతం పడగొట్టాడు. అయితే జాతీయ విధుల కన్నా... లీగ్ క్రికెట్ ద్వారానే ఎక్కువ సంపాదించుకోవచ్చనే ఈ ఆటగాళ్లంతా ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
‘కివీ’ల రూటే సపరేటు!
ఇది ఇలా ఉంటే... న్యూజిలాండ్ ఆటగాళ్ల తీరు మరో రకం. జాతీయ జట్టు తరఫున వార్షిక కాంట్రాక్టు తీసుకోవడానికి ఇష్టపడని పలువురు క్రికెటర్లు... ఫ్రాంచైజీలతో జతకట్టేందుకు ‘సై’అంటున్నారు. సెంట్రల్ కాంట్రాక్టు తీసుకుంటే... జాతీయ జట్టుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సి రావడంతో... స్టార్ క్రికెటర్లు సైతం దీనికి దూరమయ్యారు.
ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, లూకీ ఫెర్గూసన్ ఉన్నారు. వీరంతా వేర్వేరు దేశాల్లో జరిగే లీగ్‌ల్లో పాల్గొనేందుకు జాతీయ జట్టుకు దూరమయ్యారు. గతంలో ఐపీఎల్‌లో కీలకపాత్ర పోషించిన విలియమ్సన్‌ను ఈసారి వేలంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో అతడు పాకిస్తాన్ క్రికెట్ లీగ్‌లో ఆడగా... కాన్వే చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.