
న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం వారి వ్యక్తిగత నిర్ణయమని, ఇందులో ఇతరుల పాత్ర ఏమీ లేదని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరు లేకపోవడం జట్టుకు లోటే అయినా...వారి స్థానాల్లో వచ్చే ఆటగాళ్లకు ఇది మంచి అవకాశమని అతను అన్నాడు.
‘ఒక ఆటగాడు కెరీర్ మొదలు పెట్టినప్పుడు తన ఇష్ట ప్రకారమే ముగింపు కూడా ఇవ్వాలనుకుంటాడు. అది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. కోచ్, సెలక్టర్ లేదా దేశంలో ఎవరికి కూడా అతడు ఎప్పుడు రిటైర్ కావాలో ఎప్పుడు రిటైర్ కాకూడదో చెప్పే హక్కు లేదు. కాబట్టి వారిది తమ స్వంత నిర్ణయంగానే భావించాలి. ఈ ఇద్దరు అనుభవజు్ఞలు లేకపోవడం కొంత వరకు కష్టమే.
అయితే ఇతర ప్లేయర్లకు ఇది చాలా మంచి అవకాశం. నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్లుగా వారు బాధ్యత తీసుకోవాలి. చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమైనప్పుడు కూడా నేను ఇదే చెప్పాను. ఇతర బౌలర్లు సత్తా చాటి జట్టును గెలిపించారు కదా. ఈసారి కూడా ఎంతో మంది తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. కోహ్లి, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడే విషయంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని, అందుకు చాలా సమయం ఉందని భారత కోచ్ స్పష్టం చేశాడు.