భారత క్రికెట్‌లో రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ తొలగింపు చర్చలు మళ్లీ వేడెక్కాయి. మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని కొత్త మలుపు తిప్పాయి. తివారి ఆరోపణల ప్రకారం.. రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ కోల్పోవడానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ప్రధాన సెలెక్టర్ అజిత్ ఆగార్కర్ కారణం. అగార్కర్ తీసుకున్న నిర్ణయంపై గంభీర్ ప్రభావం చూపాడు.
అగార్కర్ బలమైన వ్యక్తిత్వం కలిగినవాడు. కానీ ఇలాంటి పెద్ద నిర్ణయాలు ఒంటరిగా తీసుకోలేడు. ఈ సమయంలోనే గంభీర్ ప్రభావం చూపాడు. సాధారణంగానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో చీఫ్ సెలెక్టర్ కోచ్ సూచనలు తీసుకుంటాడు. రోహిత్ వన్డే కెప్టెన్సీ తొలగింపులో ఇదే జరిగింది. రోహిత్‌కు జరిగిన అన్యాయానికి గంభీర్, అగార్కర్ బాధ్యత వహించాలి.
రోహిత్‌ను తొలగించిన తీరు తనకు అభిమానిగా, మాజీ సహచరుడిగా చాలా బాధ పెట్టింది. అప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీని, అంతకుముందే టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌ను ఇలా తొలగించడం సబబు కాదు. రోహిత్ నుండి శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ బదిలీ చేసే ప్రక్రియ సాఫీగా జరగాల్సింది.
ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్ వరకు రోహిత్‌ను కెప్టెన్సీలో కొనసాగించి, ఆతర్వాత గిల్‌కు బాధ్యతలు అప్పగించాల్సింది. 2027 ప్రపంచకప్ దృష్ట్యా రోహిత్ భవిష్యత్తుపై అనుమానం వ్యక్తం చేయడం తగదని తివారి అభిప్రాయపడ్డాడు.
తివారి చేసిన ఈ వ్యాఖ్యలతో గంభీర్–అగార్కర్ జంటపై మళ్లీ దృష్టి పడింది. నాయకత్వ మార్పులు ఎలా జరుగుతున్నాయి.. అవి సరైన రీతిలో కమ్యూనికేట్ అవుతున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన కొన్ని నెలలకే కెప్టెన్సీ తొలగించబడ్డాడు. ఈ విషయంలో భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రోహిత్ శర్మ వంటి విజయవంతమైన కెప్టెన్‌కు గౌరవప్రదంగా మార్చి ఉండాల్సిందనే వాదన బలపడుతుంది. గిల్ నియామకం భవిష్యత్తుకు సంకేతం అయినప్పటికీ, రోహిత్‌ను తొలగించిన తీరు గౌరవప్రదంగా ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.


