French Open 2023: 55 ఏళ్ల తర్వాత...

French Open 2023: Haddad Maia becomes first Brazilian woman to reach French Open - Sakshi

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌ క్రీడాకారిణి

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో బీత్రిజ్‌ హదాద్‌ ఘనత  

పారిస్‌: బ్రెజిల్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 55 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో ఆ దేశ  క్రీడాకారిణికి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో బ్రెజిల్‌కు చెందిన బీత్రిజ్‌ హదాద్‌ మాయ క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. టెన్నిస్‌లో ఓపెన్‌ శకం (1968లో) మొదలయ్యాక దివంగత మరియా బ్యూనో చివరిసారి బ్రెజిల్‌ తరఫున గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. 1968లో మరియా బ్యూనో ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ టోర్నీలలో క్వార్టర్‌ ఫైనల్‌కు... యూఎస్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరింది. మరియా బ్యూనో ఐదు గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గినా ఆ విజయాలన్నీ ఓపెన్‌ శకంకంటే ముందు వచ్చాయి.  

సోమవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ బీత్రిజ్‌ 3 గంటల 51 నిమిషాల్లో 6–7 (3/7), 6–3, 7–5తో సారా సొరిబెస్‌ టోర్మో (స్పెయిన్‌)పై విజయం సాధించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లో ఏడో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యునీషియా) 6–3, 6–1తో బెర్నార్డా పెరా (అమెరికా)పై, అమెరికా టీనేజర్‌ కోకో గాఫ్‌ 7–5, 6–2తో షిమెద్లోవా (స్లొవేకియా)పై, రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) 7–6 (7/5), 6–4తో స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌ చేరారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే), ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఆరో సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి చేరారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top