
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చిక్కుల్లో చిక్కుకున్నాడు. అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో అతనికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు పంపింది. ఇవాళ అతను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
1xBet అనే అక్రమ బెట్టింగ్ యాప్‌కు ప్రమోషన్ చేశాడని రైనాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ గాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద రైనాపై విచారణ జరుగనుంది. అక్రమ యాప్ ప్రకటనల్లో రైనా కనిపించినట్లు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి.
ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే గూగుల్, మెటా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది. 1xBet తరహాలోనే గ్యాంబ్లింగ్‌కు పాల్పడే పలు యాప్స్‌పై కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా 27,000 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు అంచనా. ఇలాంటి కేసుల్లోనే సినీ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, రానా దగ్గుబాటి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే, సురేశ్ రైనా టీమిండియా, ఐపీఎల్ నుంచి తప్పుకున్న తర్వాత వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. త్వరలో అతను సీఎస్‌కేకు బ్యాటింగ్ కోచ్‌గా వెళ్లనున్నాడని సమాచారం. రైనాకు టీమిండియా తరఫున ఆడిన దానికంటే ఐపీఎల్ ద్వారా విశేషమైన గుర్తింపు దక్కింది.
ఐపీఎల్‌లో విశేషంగా రాణించడం ద్వారా అతన్ని మిస్టర్ ఐపీఎల్‌గా కీర్తిస్తారు. ఐపీఎల్‌లో రైనా 2008 నుంచి 2021 వరకు సీఎస్‌కే తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీఎస్‌కే సాధించిన 4 ఐపీఎల్ టైటిళ్లలో రైనా కీలకపాత్ర పోషించాడు.