సౌతాఫ్రికా టీ20 లీగ్‌పై కన్నేసిన భారత అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌

Former India U19 World Cup Winning Captain Unmukt Chand Registers For SA20 Auction - Sakshi

భారత అండర్‌-19 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ (2012) ఉన్ముక్త్ చంద్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభంకాబోయే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (ఎస్‌ఏ20) తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఉన్ముక్త్‌.. సెప్టెంబర్ 19న జరిగే ఎస్‌ఏ20 లీగ్‌ వేలం కోసం తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌ బాష్ లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఉన్ముక్త్.. ఎస్‌ఏ20 లీగ్‌ వేలంలో కూడా అమ్ముడుపోతే, అక్కడ ఆడబోయే తొలి భారత క్రికెటర్‌గానూ రికార్డు నెల్పుతాడు. 

కాగా, 2012 వరల్డ్‌ కప్‌ విజయం తర్వాత రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ఉన్ముక్త్‌.. ఆతర్వాత క్రమంగా అవకాశాలు కనుమరుగు కావడంతో భారత్‌ను వదిలి అమెరికాకు వలస పోయాడు. అక్కడ యూఎస్‌ మైనర్ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఉన్ముక్త్.. బిగ్‌ బాష్ లీగ్ 2022లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున అవకాశం రావడంతో ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు.

ఉన్ముక్త్‌ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో యూఎస్‌ఏ తరఫున ఆడాలని ఆశిస్తున్నాడు. ఉన్ముక్త్‌ 2012 ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయమైన 111 పరుగులు చేసి, యువ భారత్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌ జట్లకు ఆడిన ఉన్ముక్త్‌.. ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చ లేక అక్కడి నుంచి కూడా ఔటయ్యాడు.    
చదవండి: టీమిండియాకు ఆడాలనుకున్నాడు.. అయితే అదే జట్టుకు ప్రత్యర్ధిగా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top