Unmukt Chand: టీమిండియాకు ఆడాలనుకున్నాడు.. అయితే అదే జట్టుకు ప్రత్యర్ధిగా..!

Unmukt Chand May Turn Up Against India In T20 World Cup 2024 - Sakshi

USA To Host T20 World Cup 2024: 2012 అండర్ 19 ప్రపంచకప్‌లో టీమిండియాను జగజ్జేతగా నిలిపిన నాటి భారత యువ జట్టు సారథి ఉన్ముక్త్ చంద్.. త్వరలోనే ఓ అరుదైన ఘనతను సాధించనున్నాడు. ఏ జట్టుకైతే (భారత్‌) ప్రాతినధ్యం వహించాలని కలలు కన్నాడో, త్వరలో అదే జట్టుకు ప్రత్యర్ధిగా బరిలోకి దిగే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోనున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ ఆతిధ్య హక్కులను కరీబియన్‌ దీవులతో (వెస్టిండీస్‌) పాటు యూఎస్‌ఏ కూడా దక్కించుకోవడంతో ఉన్ముక్త్‌ ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోనున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

క్రికెట్‌కు విశ్వవ్యాప్తంగా ఆదరణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీని వెస్టిండీస్‌తో పాటు యూఎస్‌ఏలో నిర్వహించేందుకు సన్నాహకాలను మొదలుపెట్టింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో హోస్ట్ కంట్రీ హోదాలో యూఎస్‌ఏ తొలిసారి మెగా టోర్నీకి అర్హత సాధించింది. దీంతో ఆ దేశ జాతీయ జట్టుకు ఆడుతున్న ఉన్ముక్త్ చంద్ పొట్టి ఫార్మాట్‌లో టీమిండియాకు ప్రత్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. 

ఉన్ముక్త్ చంద్‌తో పాటు పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా తమ సొంత దేశాలకు ప్రత్యర్ధులుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. వివిధ కారణాల చేత ప్రస్తుతం యూఎస్‌ఏ తరఫున క్రికెట్‌ ఆడుతున్న కోరే ఆండర్సన్ (న్యూజిలాండ్), లియామ్‌ ప్లంకెట్‌ (ఇంగ్లండ్‌), జుయాన్‌ థెరాన్‌ (సౌతాఫ్రికా), సమీ అస్లాం (పాకిస్థాన్‌) టీ20 వరల్డ్‌కప్‌ 2024లో తమతమ సొంత దేశాలతో తలపడే ఛాన్స్‌ ఉంది. వీరిలో కివీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కోరే ఆండర్సన్‌ 36 బంతుల్లోనే సెంచరీ చేసి ఆతర్వాత కివీస్‌ జాతీయ జట్టు నుంచి కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, అండర్‌ 19 వరల్డ్‌కప్‌ సక్సెస్‌తో టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం అవుతాడనుకున్న ఉన్ముక్త్‌ చంద్‌.. చాలాకాలం పాటు ఎదురుచూసి టీమిండియాకు ఆడే అవకాశాలు అడుగంటడంతో గతేడాది భారత్‌ను వీడి యుఎస్‌ఏకు వలస వెళ్లాడు. ఉన్ముక్త్‌ ప్రస్తుతం కోరే ఆండర్సన్, లియామ్‌ ప్లంకెట్‌, జుయాన్‌ థెరాన్‌, సమీ అస్లాం తదితరులతో కలిసి యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. భారత క్రికెటర్‌గా రిటైర్మెంట్‌ ప్రకటించి యూఎస్ఏకి మకాం మార్చిన ఉన్ముక్త్.. 2021 సీజన్‌ అమెరికన్‌ మైనర్ లీగ్‌లో పరుగుల వరద పారించాడు. ఆ సీజన్‌లో సిలికాన్‌ వ్యాలీ స్ట్రైయికర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతను.. 16 ఇన్నింగ్స్‌ల్లో 612 పరుగులు సాధించి సీజన్‌ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన ఉన్ముక్త్‌ చంద్‌.. ఆ లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top