టీమిండియాను శిక్షించిన ఐసీసీ | ICC Punishes India Women Cricket Team For Major Mistake Vs SLW In Tri Nation Series, More Details Inside | Sakshi
Sakshi News home page

టీమిండియాను శిక్షించిన ఐసీసీ

Apr 30 2025 10:46 AM | Updated on Apr 30 2025 12:55 PM

ICC Punishes India Women Cricket Team For Major Mistake Vs SLW In Tri Nation Series

శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్‌లో కోడ్‌ ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ టీమిండియాను శిక్షించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఆర్టికల్‌ 2.22 ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయం పూర్తయ్యే సరికి ఓ ఓవర్‌ వెనుక పడ్డారు. 

ఐసీసీ నియమాల ప్రకారం స్లో ఓవర్‌ రేట్‌లో ప్రతి ఓవర్‌కు ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజ్‌లో 5 శాతం కోత విధిస్తారు. మ్యాచ్‌లో పాల్గొన్న సభ్యులందరికీ ఈ కోత వర్తిస్తుంది. ఐసీసీ విధించిన ఈ జరిమానాను టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఒప్పుకోవడంతో ఎలాంటి విచారణ జరగలేదు.

వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్‌ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్‌ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. 29.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్‌ 48 (నాటౌట్‌) పరుగులతో సత్తా చాటారు.

ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై విజయం
ఈ టోర్నీలో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 29) జరిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్‌ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 276 ప‌రుగులు చేసింది.

ఓపెనర్‌ ప్రతిక రావల్‌ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41), జెమీమా రోడ్రిగెజ్‌ (41), స్మృతి మంధన (36), హర్లీన్‌ డియోల్‌ (29), రిచా ఘోష్‌ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.

భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కు ఔట్‌ కాగా.. కశ్వీ గౌతమ్‌ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్‌, డి క్లెర్క్‌, డెర్క్‌సెన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 277 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా.. 49. 2 ఓవ‌ర్ల‌లో 261 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓ ద‌శ‌లో సునాయాసంగా గెలిచేలా క‌నిపించిన సౌతాఫ్రికాను భార‌త స్పిన్న‌ర్ స్నేహ్ రాణా దెబ్బ‌తీసింది. 48వ ఓవ‌ర్‌లో మూడు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

రాణా ఓవ‌రాల్‌గా త‌న 10 ఓవ‌ర్ల కోటాలో 43 ప‌రుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. ద‌క్షిణాఫ్రికా 11 ప‌రుగుల వ్య‌వ‌ధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు స్నేహ్‌ రాణాకు ప్లేయర్ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌లో టాజ్మిన్ బ్రిట్స్ (107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 109) విరోచిత శ‌త‌కంతో చెల‌రేగింది. ఆమెతో పాటు లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించిన‌ప్ప‌టికి.. వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోవ‌డంతో ప్రోటీస్‌ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది.

కాగా, ఈ ట్రై నేషన్‌ సిరీస్‌లో భారత్‌, సౌతాఫ్రికా, శ్రీలంకు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భారత్‌.. సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్‌ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ప్రస్తుతం భారత్‌ టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement