
నేడు ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టుతో భారత ‘ఎ’ జట్టు టి20 మ్యాచ్
మకాయ్ (క్వీన్స్‌లాండ్): అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత యువ ప్లేయర్లు ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ టూర్‌లో భాగంగా భారత మహిళ ‘ఎ’ జట్టు... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో మూడు టి20లు, మూడు వన్డేలు, ఓ నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. టి20 సిరీస్‌లో భాగంగా గురువారం మకాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
ఇందులో భారత ‘ఎ’ జట్టుకు రాధా యాదవ్ సారథిగా వ్యవహరిస్తుండగా... చాన్నాళ్ల తర్వాత భారత టి20 జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ అనుభవం ఉన్న పలువురు ప్లేయర్లతో పాటు కొత్త వాళ్లకు ఇందులో అవకాశం కల్పించారు. మిన్ను మణి, సజన, ఉమా ఛెత్రి, రాఘ్వి బిస్త్, తనూజ కన్వర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షబ్నమ్ షకీల్, సైమా ఠాకూర్, టిటాస్ సాధు భారత ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు.
మరోవైపు గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ ఆసీస్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుకు నికోల్ ఫాల్టుమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా... తహిలా విల్సన్, కిమ్ గార్త్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ పర్యటనలోని మూడు ఫార్మాట్లకూ భారత ‘ఎ’ జట్టుకు రాధ యాదవ్ కెపె్టన్‌గా వ్యవహరించనుంది.