
PC: BCCI
టీమిండిమా మాజీ క్రికెటర్ జోస్యం
ఐపీఎల్-2025 (IPL 2025) ముగింపు దశకు వచ్చేసింది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. క్వాలిఫయర్-1 కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. లీగ్ దశ ముగిసే సరికి టాప్-2లో ఉన్న జట్లు ఈ పోరుకు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.
ఆ రెండు మ్యాచ్‌ల ఫలితాలతో..
సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లూ పూర్తి చేసుకున్న గుజరాత్.. తొమ్మిది గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన మూడు జట్లకు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ మిగిలి ఉండగా.. ఓవరాల్‌గా సీజన్‌లో రెండు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ తలపడనుండగా.. మంగళవారం నాటి పోరులో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడుతుంది.
ఈ మ్యాచ్ తర్వాత టాప్-2లో నిలిచి క్వాలిఫయర్-1 ఆడే జట్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే జట్లు ఏవో తేలుతాయి. ఇక క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు.. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-2లో తలపడుతుందన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్-1 విజేత టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి.
ఫైనల్ ఆడే జట్లు ఇవే
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా క్వాలిఫయర్-1, ఫైనల్లో తలపడే జట్లపై తన అంచనా తెలియజేశాడు. పంజాబ్ కింగ్స్‌పై ముంబై, లక్నోపై ఆర్సీబీ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు ఆక్రమిస్తాయని జోస్యం చెప్పాడు.
అదే విధంగా.. ఈ రెండు జట్లే ట్రోఫీ కోసం ఫైనల్లో తలపడతాయని అంచనా వేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘ముంబై పంజాబ్‌పై గెలవాలని పట్టుదలగా ఉంది. వాళ్లు గనుక గెలిస్తే టాప్-2లోకి వస్తారు. ఇది జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇక ఆర్సీబీ కూడా అంతే. లక్నోపై ఆ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నా అంచనా ప్రకారం ముంబై- ఆర్సీబీ టాప్-2లో నిలుస్తాయి. అదే విధంగా ఈ రెండు జట్లే ఫైనల్లోనూ తలపడతాయి’’ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
మిగిలిన షెడ్యూల్ ఇలా
👉క్వాలిఫయర్-1: మే 29, గురువారం, చండీగఢ్
👉ఎలిమినేటర్ మ్యాచ్: మే 30, శుక్రవారం, చండీగఢ్
👉క్వాలిఫయర్-2: జూన్ 1, ఆదివారం, అహ్మదాబాద్
👉ఫైనల్: జూన్ 3, మంగళవారం, అహ్మదాబాద్.
చదవండి: Pat Cummins: ఫైనల్ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది