ఫైనల్‌ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది: కమిన్స్‌ | Pat Cummins Comments On Team's Performance In IPL 2025, Says We Should Play In IPL 2025 Final But Didnt Work Out | Sakshi
Sakshi News home page

Pat Cummins: ఫైనల్‌ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది

May 26 2025 9:35 AM | Updated on May 26 2025 11:03 AM

SRH Should Play in IPL 2025 Final But Didnt Work Out: Pat Cummins

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌-2025 (IPL 2025) సీజన్‌ను అద్భుత విజయంతో ముగించామని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు విధ్వంసకర ఆటతో విరుచుకుపడుతుంటే తనకు కూడా కాస్త భయం వేసిందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తమ జట్టులో అద్బుత ఆటగాళ్లు ఉన్నారని.. ఫైనల్‌ చేరే సత్తా ఉన్నా ఈసారి ఆ పని చేయలేకపోయామని పేర్కొన్నాడు.

రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత
కాగా గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌.. ఈసారి మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై వీరబాదుడు మినహా ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత మాత్రం కమిన్స్‌ బృందం వింటేజ్‌ బ్యాటింగ్‌తో రెచ్చిపోయింది.

ఆఖరి మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో గెలిచిన రైజర్స్‌.. తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో రహానే సేనపై 110 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్లలో అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 32) రాణించగా.. ట్రవిస్‌ హెడ్‌ (40 బంతుల్లో 76) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

క్లాసెన్‌కు పూనకాలు 
ఇక హెన్రిచ్‌ క్లాసెన్‌ పూనకం వచ్చినట్లుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. 37 బంతుల్లో శతక్కొట్టిన క్లాసెన్‌.. ఐపీఎల్‌లో మూడో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 9 సిక్స్‌ల సాయంతో 105 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది సన్‌రైజర్స్‌.

లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ను 18.4 ఓవర్లలోనే ఆలౌట్‌ చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల విజృంభణతో రహానే సేన 168 పరుగులకే కుప్పకూలింది. ఇలా సమిష్టి ప్రదర్శనతో జట్టు రాణించడం పట్ల రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

‘‘అద్భుతమైన ముగింపు. ఈ సీజన్‌లో గత కొన్ని మ్యాచ్‌లలో మేము సూపర్‌గా ఆడాము. మా వాళ్ల బ్యాటింగ్‌ భయంకరంగానే ఉందని చెప్పవచ్చు (నవ్వులు). మా ఆటగాళ్ల సమర్థత దృష్ట్యా నిజానికి ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు ఇంత చెత్తగా ఆడాల్సింది కాదు.

ఫైనల్‌ చేరాల్సిన జట్టు
ఫైనల్‌కు చేర్చగల సత్తా ఉన్న ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు. కానీ ఈసారి మేము ఫైనల్‌ చేరలేకపోయాం. ఢిల్లీ వికెట్‌ మీద మా వాళ్లు అదరగొట్టారు. ఈసారి మా జట్టు బాగానే ఉంది. అయితే, కొంత మంది గాయాల వల్ల స్వదేశానికి వెళ్లిపోయారు. జట్టులోని 20 మంది ఆటగాళ్ల సేవలను మేము ఉపయోగించుకున్నాము’’ అని కమిన్స్‌ చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ పద్నాలుగింట ఆరు గెలిచి.. ఏడు ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ వర్షం వల్ల రద్దైపోయింది. ఈ క్రమంలో 13 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో ఆరోస్థానంలో ఉంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే గనుక ఏడో స్థానానికి పడిపోతుంది.

చదవండి: IPL: రిటైర్మెంట్‌పై ధోని కీల‌క వ్యాఖ్య‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement