
న్యూఢిల్లీ: ప్రొ హాకీ లీగ్ చివరి అంచె టోర్నమెంట్‌లో పాల్గొనే భారత మహిళల జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు జార్ఖండ్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్ సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. పంజాబ్‌కు చెందిన ఫార్వర్డ్ నవ్‌నీత్ కౌర్ వైస్ కెపె్టన్‌గా వ్యవహరిస్తుంది. ప్రొ హాకీ లీగ్ చివరి అంచె మ్యాచ్‌లు జూన్ 14 నుంచి 29వ తేదీ వరకు యూరోప్‌లోని జర్మనీ,బ్రిటన్, బెల్జియం దేశాల్లో జరుగుతాయి.
ఈ టోర్నీలో భారత జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడుతుంది. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బెల్జియం, చైనా జట్లతో భారత్ రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. భారత జట్టు వరుసగా జూన్ 14, 15వ తేదీల్లో లండన్‌లో ఆ్రస్టేలియా జట్టుతో... జూన్ 17, 18వ తేదీల్లో లండన్‌లో అర్జెంటీనాతో... జూన్ 21, 22వ తేదీల్లో ఆంట్‌వర్ప్‌లో బెల్జియంతో... జూన్ 28, 29వ తేదీల్లో బెర్లిన్‌లో చైనా జట్టుతో పోటీపడుతుంది.
తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ హాకీ లీగ్‌లో భారత్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం తొమ్మిది పాయింట్లతో భారత్ ఆరో స్థానంలో ఉంది. టోర్నీ ముగిశాక చివరిదైన తొమ్మిదో స్థానంలో నిలిచిన జట్టు వచ్చే సీజన్‌లో ప్రొ లీగ్ నుంచి బయటకు వచ్చి నేషన్స్ కప్‌లో ఆడాల్సి ఉంటుంది. ప్రొ లీగ్ విజేత జట్టు తదుపరి ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.
భారత మహిళల హాకీ జట్టు
సలీమా టెటె (కెప్టెన్), నవ్‌నీత్ కౌర్ (వైస్ కెప్టెన్), సవిత, బిచ్చూదేవి (గోల్ కీపర్లు), సుశీలా చాను, జ్యోతి, సుమన్ దేవి, జ్యోతి సింగ్, ఇషిక చౌధరీ, జ్యోతి ఛత్రి (డిఫెండర్లు), వైష్ణవి విఠల్ ఫాడ్కే, సుజాత కుజుర్, మనీశా చౌహాన్, నేహా, లాల్‌రెమ్‌సియామి, షర్మిలా దేవి, సునెలితా టొప్పో, మహిమా టెటె (మిడ్ ఫీల్డర్లు), దీపిక, దీపిక సోరెంగ్, బల్జీత్ కౌర్, రుతుజా, బ్యూటీ డుంగ్‌డుంగ్, సాక్షి రాణా (ఫార్వర్డ్‌లు).