'సూర్య లేకుంటే మూడు ఫార్మాట్లు లేనట్లే'

Ex-cricketer Says Without Suryakumar All 3-Formats Should Not Even Exist - Sakshi

గతేడాది టి20ల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గానూ టీమిండియా క్రికెటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఐసీసీ మెన్స్‌ టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. టి20ల్లో ఇప్పటికే సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్‌ వన్డేల్లోనూ నిలదొక్కుకునే ప్రయత్నంలో​ ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌కు కూడా సూర్య ఎంపికయ్యాడు. ఒకవేళ​ తుదిజట్టులోకి ఎంపికైతే మాత్రం మూడు ఫార్మాట్లు ఆడిన క్రికెటర్‌గా సూర్యకుమార్‌ నిలవనున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పేరు తెచ్చుకున్న సూర్య టెస్టుల్లో ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా సూర్యకుమార్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు." కచ్చితంగా సూర్యకుమార్‌ ఆడుతున్న తీరు చూస్తుంటే.. అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉండాల్సిందేనని భావిస్తున్నా. అతడు లేకపోతే మూడు ఫార్మాట్లూ ఉండవు. అతని ఆటతీరు, సంకల్పం, షాట్లు ఆడే తీరు నాకు చాలా ఇష్టం. పైగా ఎలాంటి భయం లేకుండా ఆడడం అతని నైజం.

గ్రౌండ్ కొలతలను తనకు తగినట్లుగా మార్చుకోగలడు. అతడు ముంబై ప్లేయర్. రెడ్ బాల్ క్రికెట్ ఎలా ఆడాలో అతనికి తెలుసు. అతనికిది గొప్ప అవకాశం. టెస్టు క్రికెట్ ఆడటం వల్ల వన్డే టీమ్ లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు. తర్వాత ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయగలడు" అని రైనా అన్నాడు. ఇక ఇదే చర్చలో పాల్గొన్న మరో మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా రైనా వ్యాఖ్యలతో ఏకీభవించాడు.

"కచ్చితంగా అతడు టెస్టు టీమ్ లో ఉండాలి. సూర్య ఆడిన తీరు చూస్తే అతడు మూడు ఫార్మాట్లలోనూ ఉండాలి. ఈ ప్రశ్న ఎందుకు వస్తుందో నాకు తెలుసు. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తుంది. కానీ అతనికి కూడా టైమ్ వస్తుంది. కానీ సూర్య టెస్టు టీమ్ లో ఉండటానికి 100 శాతం అర్హుడు" అని ఓజా స్పష్టం చేశాడు.

ఇక ఏడాది కాలంగా ఇండియన్ క్రికెట్ లో మార్మోగుతున్న పేరు సూర్యకుమార్ యాదవ్. వేగానికి మారుపేరైన సూర్యను టెస్టులకు ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. టాప్ ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ బదులు సూర్యకు చోటివ్వడమేంటని మాజీ క్రికెటర్లు సహా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: అభిమానులనుద్దేశించి సూర్యకుమార్‌ ఎమోషనల్‌ పోస్టు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top