లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో లార్డ్స్‌లో జరిగిన 150వ మ్యాచ్ కావడంతో చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలో 150 టెస్ట్‌లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియం లార్డ్స్ క్రికెట్ మైదానం.
పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ ఇంగ్లండ్‌ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది. జేమీసన్ 5, నాథన్ స్మిత్ 3, విలియమ్ ఓరూర్కీ 2 వికెట్లతో సత్తా చాటారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (56) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.
అనంతరం న్యూజిలాండ్ మరింత చెత్తగా ఆడి 113 పరుగులకే కుప్పకూలింది. రాబిన్సన్ 5, టంగ్ 3, అట్కిన్సన్ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన జేమీసన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
27 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ అరంగేట్రం బ్యాటర్ ఎమిలియో గే (57), డకెట్ (33), జేమీ స్మిత్ (39) రాణించడంతో 226 పరుగులు చేయగలిగింది. నాథన్ స్మిత్ 6 వికెట్లతో విజృంభించగా.. విలియమ్ ఓరూర్కీ 2, మ్యాట్ హెన్రీ, జేమీసన్ తలో వికెట్ తీశారు.
254 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మరోసారి బొక్కబోర్లా పడింది. అట్కిన్సన్ 5, రాబిన్సన్, టంగ్ తలో 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టడంతో 138 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో కాన్వే (41), గ్లెన్ ఫిలిప్స్ (44 నాటౌట్), కేన్ విలియమ్సన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 17న మొదలవుతోంది.


