
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్‌లో 600 పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రూట్.. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజాపై ఈ ఘనత సాధించాడు. తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో రూట్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు.
రూట్ జడేజా బౌలింగ్‌లో ఇప్పటివరకు 602 పరుగులు సాధించాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ ఓ సింగిల్ బౌలర్ బౌలింగ్‌లో ఇన్ని పరుగులు సాధించలేదు. ఈ జాబితాలో రూట్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 577 పరుగులు చేశాడు.
రూట్, స్మిత్ తర్వాతి స్థానంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ బౌలింగ్‌లో 573 పరుగులు సాధించాడు.
కాగా, టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ-2025లో రూట్-జడేజా మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ సిరీస్‌లో జడేజా రూట్‌ను ఒక్కసారే (నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్) ఔట్ చేసినా ఇరువురి మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది.
అంకెల ప్రకారం చూస్తే జడేజాపై రూట్ పైచేయి సాధించినట్లు కనిపించినా, జడ్డూను ఎదుర్కొనేందుకు రూట్ ఇబ్బంది పడ్డాడు. వాస్తవంగా ఉపఖండలో జడేజాను ఎదుర్కోవడం రూట్‌కు కత్తి మీద సాము అవుతుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై జడేజా బౌలింగ్‌లో రూట్ చాలా ఇబ్బంది పడ్డాడు. జడ్డూ తన కెరీర్‌లో రూట్‌ను మొత్తం 9 సార్లు ఔట్ చేశాడు. తద్వారా ఓ బ్యాటర్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గానూ రికార్డు కలిగి ఉన్నాడు.
ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ డ్రాగా ముగిసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలో రెండు మ్యాచ్‌లు గెలువగా.. ఓ మ్యాచ్ డ్రా అయ్యింది. హోరాహోరీగా సాగిన ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 1,3 టెస్ట్‌లు గెలువగా.. భారత్ 2,5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఐదో టెస్ట్‌లో భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.
ఈ మ్యాచ్ చివరి రోజు భారత్ 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉండగా.. సిరాజ్ అద్భుతం చేశాడు. ఇంగ్లండ్ చేతిలో ఉండిన 4 వికెట్లలో 3 వికెట్లు తీసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు.
374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్ట స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్‌పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. అతనికి ప్రసిద్ద్ సహకరించాడు.
వీరిద్దరు కలిపి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సహా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.