KL Rahul: గత 11 ఏళ్లలో ఒకే ఒక్కడు..! | ENG VS IND 5TH TEST: KL RAHUL BECOMES FIRST INDIAN OPENER TO FACED 1000 PLUS BALLS IN A TEST SERIES IN THE LAST 11 YEARS | Sakshi
Sakshi News home page

KL Rahul: గత 11 ఏళ్లలో ఒకే ఒక్కడు..!

Jul 31 2025 7:28 PM | Updated on Jul 31 2025 7:42 PM

ENG VS IND 5TH TEST: KL RAHUL BECOMES FIRST INDIAN OPENER TO FACED 1000 PLUS BALLS IN A TEST SERIES IN THE LAST 11 YEARS

కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (జులై 31) మొదలైన ఐదో టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 40 బంతులు ఎదుర్కొని బౌండరీ సాయంతో 14 పరుగులు చేసి ఔటైన రాహుల్‌.. ఈ సిరీస్‌లో తానెదుర్కొన్న బంతుల సంఖ్యను వెయ్యి (1000) దాటించాడు. 

తద్వారా గత 11 ఏళ్ల ఓ టెస్ట్‌ సిరీస్‌లో 1000 బంతులు ఎదుర్కొన్న ఏకైక భారత ఓపెనింగ్‌ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో భారత ఓపెనర్‌గా నిలిచాడు. రాహుల్‌కు ముందు మురళీ విజయ్‌, సునీల్‌ గవాస్కర్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ లంచ్‌ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 72 పరుగులు (23 ఓవర్లలో) చేసింది. సాయి సుదర్శన్‌ (25), శుభ్‌మన్‌ గిల్‌ (15) క్రీజ్‌లో ఉన్నారు. 

వర్షం అంతరాయం కలిగించడంతో లంచ్‌ బ్రేక్‌ను కాస్త ముందుగానే తీసుకున్నారు. వెట్‌ ఔట్‌ ఫీల్డ్‌ కారణంగా లంచ్‌ తర్వాత కూడా ఆట ఆలస్యమవుతుంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కూడా వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో టాస్‌ కూడా ఆలస్యమైంది.

ఆదిలోనే ఎదురుదెబ్బలు
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (2), కేఎల్‌ రాహుల్‌ (14) జట్టు స్కోర్‌ కనీసం 50 పరుగులు కూడా దాటించకుండానే పెవిలియన్‌కు చేరారు. జట్టు స్కోర్‌ 10 పరుగుల వద్ద జైస్వాల్‌ను అట్కిన్సన్‌, 38 పరుగుల స్కోర్‌ వద్ద రాహుల్‌ను క్రిస్‌ వోక్స్‌ బోల్తా కొట్టించారు.

చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌
ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ ఈ ఇన్నింగ్స్‌లో ఓ ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఓ టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా సునీల్‌ గవాస్కర్‌ రికార్డును ఛేదించాడు.

1978/79 వెస్టిండీస్‌ సిరీస్‌లో గవాస్కర్‌ భారత కెప్టెన్‌గా 732 పరుగులు చేయగా.. ప్రస్తుత  సిరీస్‌లో గిల్‌ 737* పరుగుల వద్ద బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

చెరో నాలుగు మార్పులు
ఈ మ్యాచ్‌ కోసం భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు చెరో నాలుగు మార్పులు చేశాయి. భారత్‌ తరఫున రిషబ్‌ పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, అన్షుల్‌ కంబోజ్‌ స్థానాల్లో ధ్రువ్‌ జురెల్‌, కరుణ్‌ నాయర్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, ఆకాశ్‌దీప్‌ తుది జట్టులోకి రాగా.. ఇంగ్లండ్‌ తరఫున బెన్‌ స్టోక్స్, ‌జోఫ్రా ఆర్చర్‌, బ్రైడన్‌ కార్స్‌, లియామ్‌ డాసన్‌ స్థానాల్లో జేకబ్‌ బేతెల్‌, గస్‌ అట్కిన్సన్‌, జోష్‌ టంగ్‌, జేమీ ఓవర్టన్‌ ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చారు.

ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ సిరీస్‌ను సమం చేసుకోగలుగుతుంది. ఓడినా, డ్రా అయినా ఇంగ్లండే సిరీస్‌ ఎగరేసుకుపోతుంది.  

తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్(వికెట్‌కీపర్‌), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement