
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన సహా మొత్తం 9 వికెట్లు తీసిన సిరాజ్.. ఆట చివరి రోజు అద్బుతం చేశాడు.
ఇంగ్లండ్ గెలుపుకు 35 పరుగులు అవసరమైన దశలో తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీసి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్నాడు. చివరి రోజు ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లు ఉండగా.. సిరాజ్ మ్యాజిక్ స్పెల్‌తో మూడు వికెట్లు తీశాడు. మరో వికెట్‌ను ప్రసిద్ద్ కృష్ణ పడగొట్టాడు.
దీంతో ఇంగ్లండ్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ విశేషంగా రాణించాడు. 5 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్ కూడా సిరాజే.
374 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలతో చెలరేగడంతో ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే భారత పేసర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో చివరి 7 వికెట్లు 66 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. సిరాజ్ చిరకాలం గర్తుండిపోయే స్పెల్ వేసి టీమిండియా అపూర్వ విజయాన్నిందించాడు.
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.
దీనికి ముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలే (64), హ్యారీ బ్రూక్ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 1,3 మ్యాచ్‌లు గెలువగా.. భారత్ 2, 5 మ్యాచ్‌ల్లో నెగ్గింది. నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది.