
లార్డ్స్ వేదికగా టీమిండియాతో నిన్న (జులై 10) ప్రారంభమైన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
రెచ్చిపోయిన నితీశ్ కుమార్
13 ఓవర్ల వరకు స్థిరంగా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ ధాటికి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. నితీశ్ 14వ ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్, ఆరో బంతికి జాక్ క్రాలేను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు.
అయితే ఓలీ పోప్.. రూట్ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 109 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ పటిష్ట స్థితికి చేరింది. అనంతరం జడేజా పోప్‌ను ఔట్ చేశాడు. 50వ ఓవర్ తొలి బంతికి జడ్డూ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి పోప్ పెవిలియన్‌కు చేరాడు.
ఆతర్వాత కొద్ది సేపటికే ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. బుమ్రా అద్భుతమైన బంతితో హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో రూట్‌తో జతకట్టిన స్టోక్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయమైన 79 పరుగులు జోడించి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.
ముఖ్యంగా రూట్ తనలోని అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టి భారత్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నాడు. రూట్ 99 పరుగుల వద్ద తొలి రోజు ఆటను ముగించాడు. రూట్ తొలి రోజు సెంచరీ పూర్తి చేయకుండా భారత బౌలర్లు అడ్డుకున్నారు. చివరి ఓవర్‌లో రూట్ సెంచరీ పూర్తి చేయాలని ప్రయత్నించినా కుదర్లేదు.
రూట్ సాధించిన రికార్డులు
ఏది ఏమైన ఈ ఇన్నింగ్స్‌తో రూట్ పలు రికార్డులను సాధించాడు. 45 పరుగుల స్కోర్ వద్ద భారత్‌పై టెస్ట్‌ల్లో 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఓ జట్టుపై ఓ బ్యాటర్ 3000 పరుగులు చేయడం ఇది మూడో సారి. రూట్ కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ ఇంగ్లండ్‌పై, సచిన్ టెండూల్కర్ ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించారు.
ఈ ఇన్నింగ్స్‌తో రూట్ మరో 3 రికార్డులు కూడా సాధించాడు. 99 పరుగుల స్కోర్ వద్ద రూట్ ఇంగ్లండ్‌లో 7000 టెస్ట్ పరుగులు పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తొలి ఫోర్‌తో రూట్ టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున 800 ఫోర్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అలిస్టర్ కుక్ (816) తర్వాత ఈ ఫీట్‌ను నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 33 పరుగుల వద్ద రూట్ భారత్‌పై అన్ని ఫార్మాట్లలో 4000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో చాలా తక్కువ మంది ఈ ఫీట్‌ను సాధించారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇంగ్లండ్, భారత్ తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలవగా.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ విజయం సాధించింది.