
పురుషుల పోల్‌వాల్ట్‌లో డుప్లాంటిస్ ఘనత
6.29 మీటర్లను అధిగమించిన స్వీడన్ స్టార్
బుడాపెస్ట్: ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టడం అలవాటుగా మార్చుకున్న స్వీడన్ విఖ్యాత పోల్‌వాల్టర్ మోండో డుప్లాంటిస్ మరోసారి అదరగొట్టాడు. ఇస్తవాన్ గ్యులాయ్ స్మారక అథ్లెటిక్స్ మీట్‌లో 25 ఏళ్ల డుప్లాంటిస్ 13వసారి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అయిన డుప్లాంటిస్ రెండో ప్రయత్నంలో 6.29 మీటర్ల ఎత్తుకు ఎగిరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో గత జూన్‌లో 6.28 మీటర్లతో స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ మీట్ సందర్భంగా నెలకొల్పిన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు.
ఐదేళ్ల క్రితం పోలాండ్‌లో జరిగిన మీట్‌లో డుప్లాంటిస్ 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి తొలిసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 6.16 మీటర్లతో రెనాడ్ లావిలెని (ఫ్రాన్స్) పేరిట ఉన్న వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ తిరగరాశాడు. అప్పటి నుంచి డుప్లాంటిస్ వెనుదిరిగి చూడలేదు. 2020లో రెండోసారి... 2022లో మూడుసార్లు... 2023లో రెండుసార్లు... 2024లో మూడుసార్లు... 2025లో మూడుసార్లు అతను ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.
2020 టోక్యో ఒలింపిక్స్... 2024 పారిస్ ఒలింపిక్స్...2022 ప్రపంచ చాంపియన్‌షిప్, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు నెగ్గిన డుప్లాంటిస్ గత నాలుగేళ్లుగా డైమండ్ లీగ్‌లో విజేతగా నిలుస్తున్నాడు. 2022, 2024, 2025లలో జరిగిన ప్రపంచ ఇండోర్ చాంపియన్‌షిప్ పోటీల్లోనూ ఈ స్వీడన్ స్టార్ బంగారు పతకాలు గెలిచాడు.
పురుషుల, మహిళల పోల్‌వాల్ట్ విభాగాల్లో అత్యధికసార్లు ప్రపంచ రికార్డులు సృష్టించిన ఘనత సెర్గీ బుబ్కా (ఉక్రెయిన్), ఎలీనా ఇసిన్‌బయేవా (రష్యా)ల పేరిట ఉంది. వీరిద్దరూ 17 సార్లు చొప్పున ప్రపంచ రికార్డులు సృష్టించారు. ఇదే జోరు కొనసాగిస్తే డుప్లాంటిస్ ఏడాదిలోపు వీరిద్దరిని అధిగమించే అవకాశాలున్నాయి.