Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని సాధించింది. ఐదు పరాజయాలతో అట్టడుగు స్థానంలో నిలిచిన కేకేఆర్ ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపు రుచి చూసింది. ఒక దశలో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కూడా ఓటమి చవిచూస్తుందని అంతా భావించారు.
కానీ జట్టు వైస్‌కెప్టెన్ రింకూ సింగ్ తన సహచర బ్యాటర్ అనుకుల్ రాయ్‌తో కలిసి వరుస ఓటములతో ఢీలా పడిన కేకేఆర్ రాతను మార్చాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనకు లభించిన లైఫ్‌ను రింకూ సింగ్ చక్కగా వినియోగించుకున్నాడు. రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను నండ్రీ బర్గర్ వదిలేయడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు. మొత్తంగా రింకూ సింగ్ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
తనకు లైఫ్ వస్తే ఎంత డేంజర్ అనేది రింకూ సింగ్ రాజస్తాన్ బౌలర్లకు రుచి చూపించాడు.ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రింకూ సింగ్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో తన విలువను చూపించాడు. అనుకుల్ రాయ్ క్రీజులోకి వచ్చేసరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 85 పరుగులతో ఉంది. విజయానికి ఆరు ఓవర్లలో 69 పరుగులు కావాలి.
అనుకుల్ రాయ్ నుంచి మంచి సహకారం అందడంతో రింకూ సింగ్ స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝలిపించాడు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే 76 పరుగుల విన్నింగ్ భాగస్వామ్యం నమోదు చేసి కేకేఆర్‌కు సీజన్‌లో మొదటి విజయాన్ని అందించారు. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడాడు.
‘కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి వస్తుందంటారు. ఇవాళ మ్యాచ్‌లో నా విషయంలో అదే జరిగింది. నిజానికి 8 పరుగుల వద్ద నాకు లైఫ్ లభించినప్పుడు అదృష్టం ఇవాళ నాతోనే ఉందని భావించాను. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మేము దాదాపు ఓటమి అంచున నిలిచాం. అయితే నాకు లభించిన లైఫ్‌ను రెండో చాన్స్ అనుకుని ఆడాను. అనుకుల్ రాయ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది.
తొలుత నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాను. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యాను. అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తూ వచ్చాను. అది ఈరోజు నెరవేరింది. బ్యాటింగ్‌లో నాకు నిర్ధిష్టమైన స్థానమంటూ లేదు. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను.
ఇవాళ్టి ఇన్నింగ్స్ పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. సీజన్‌లో మా జట్టకు ఇదే తొలి విజయం కాబట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పొచ్చు. ఇదే ఊపును రాబోయే మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రింకూకు సపోర్ట్ ఇచ్చిన అనుకుల్ రాయల్ (16 బంతుల్లో 29 నాటౌట్) జీవితంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.
SENSATIONAL FINISH 🤯
Rinku Singh & Anukul Roy, take a bow! 💜
Scorecard ▶️ https://t.co/776nTdODZL#TATAIPL | #KhelBindaas | #KKRvRR | @KKRiders pic.twitter.com/HY9R9Kh0lT— IndianPremierLeague (@IPL) April 19, 2026


