టీ20 ప్రపంచకప్-2026కు ముందు సౌతాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆల్‌రౌండర్ డోనోవన్ ఫెరీరా భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశముంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ఫెరీరా.. శనివారం ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.
ప్రిటోరియా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో అతడి ఎడమ భుజం బలంగా నేలకు తాకింది. దీంతో ఫెరీరా తీవ్రమైన నొప్పితో విలవిలాడాడు. ఆ తర్వాత జట్టు కష్టాల్లో ఉండడంతో ఫెరీరా తప్పనిసారి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ కేవలం ఒకే ఒక బంతి మాత్రమే ఎదుర్కొని రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు.
మ్యాచ్ ముగిశాక అతడిని స్కానింగ్‌కు తరలించగా.. భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఈ టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు. ఫెరీరా కోలుకోవడానికి దాదాపు ఐదు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు పొట్టి ప్రపంచకప్ నుంచి తప్పుకొనే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే సౌతాఫ్రికాకు నిజంగా భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫెరీరా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ తర్వాత ప్రధాన ఫినిషర్‌గా ఫెరీరా ఉన్నాడు. 2024 నుంచి టీ20ల్లో అత్యధిక స్ట్రైక్ రేటు కలిగి ఉన్న బ్యాటర్‌గా ఫెరీరా కొనసాగుతున్నాడు.
86 ఇన్నింగ్స్‌లలో 177.08 స్ట్రైక్ రేటుతో 1716 పరుగులు చేశాడు. గత నెలలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా డోనోవన్ దుమ్ములేపాడు. అతడి ఆఫ్ స్పిన్ కూడా బౌలింగ్ చేయగలడు. ఒక వేళ అతడు ఈ టోర్నీకి దూరమైతే ర్యాన్ రికెల్టన్ లేదా ట్రిస్టన్ స్టబ్స్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.
టీ20 వరల్డ్ కప్ 2026 కోసం దక్షిణాఫ్రికా జట్టు:
ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), కోర్బిన్ బాష్, డేవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్ (కీపర్), టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్జే, కాగిసో రబాడ, జేసన్ స్మిత్.
చదవండి: వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!


