
ఎవరూ పట్టించుకోని పసివాడిలా భావించాను
ఫెడరర్, నాదల్‌లపై జొకోవిచ్ వ్యాఖ్య
సెర్బియా స్టార్ ప్లేయర్ అంతరంగం
బెల్‌గ్రేడ్: పురుషుల టెన్నిస్‌ను దాదాపు రెండు దశాబ్దాల పాటు ఫెడరర్, నాదల్, జొకోవిచ్ శాసించారు. ఫెడరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకోగా, నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో దానిని సవరించాడు. ఆ తర్వాత జొకొవిచ్ 24 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సాధించి అగ్ర స్థానాన నిలిచాడు. అయితే సుదీర్ఘ కెరీర్‌లో ఫెడరర్, నాదల్ అభిమానులకు చేరువైనంతగా జొకోవిచ్ కాలేకపోయాడు. ఆట అద్భుతమే అయినా కొన్నిసార్లు కోర్టులో తన ప్రవర్తన, మాటతీరు అతని ప్రతిష్టను కొంత తగ్గించాయి.
ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వయంగా జొకోవిచ్ ఈ విషయాన్ని అంగీకరించాడు. ఫెడరర్, నాదల్ తరహాలో తాను టెన్నిస్ ప్రేమికుల నుంచి తగినంత అభిమానం పొందలేకపోయానని అతను వ్యాఖ్యానించాడు. ‘నాలో ఎన్నో లోపాలు ఉండవచ్చు. అది వాస్తవం. అయితే ఎప్పుడూ మనసులో చెడు ఆలోచనలు లేకుండా మంచి ఉద్దేశంతోనే నా జీవితాన్ని గడిపాను. నాకు నచ్చినట్లుగా బతికాను.
కానీ ఫెడరర్, నాదల్‌తో పోలిస్తే చాలాసార్లు నేను ఎవరికీ అక్కర్లేని పసివాడిలా నన్ను చూశారు. ఈ కారణంగా చాలాసార్లు బాధపడ్డాను. ఎందుకు ఇలా జరుగుతోందని చాలాసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా ప్రవర్తన మారితే అంతా బాగుంటుందని భావించి ఆ ప్రయత్నమూ చేశాను. అయినా సఫలం కాలేకపోయాను’ అని జొకోవిచ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అందుకే నన్ను పట్టించుకోలేదు...
ఫెడరర్, నాదల్‌తో పోలిస్తే తనకు తగినంత గౌరవం దక్కకపోవడానికి భౌగోళిక పరిస్థితులు కూడా ఒక కారణమని జొకోవిచ్ అభిప్రాయపడ్డాడు. యూరోప్‌లోని ప్రముఖ దేశాల నుంచి వారిద్దరు వచ్చారని, తాను వారికి సవాల్ విసరడం కొందరికి నచ్చలేదని అతను అన్నాడు. ‘నాకు గుర్తింపు రాకముందే ఫెడరర్, నాదల్ సమఉజ్జీలైన ప్రత్యర్థులుగా పోరాడుతూ వచ్చారు.
పశ్చిమాన బలమైన దేశాలైన స్విట్జర్లాండ్, స్పెయిన్‌ల నుంచి వారు వచ్చారు. కాబట్టి నాతో పోలిస్తే సహజంగానే వారికి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరే గొప్ప ఆటగాళ్లు అనే కొందరి మనస్తత్వాన్ని నేను మార్చలేకపోయాను. పైగా నంబర్‌వన్‌ను అవుతాను అంటూ నేను చేసిన ప్రకటన చాలా మందికి నచ్చలేదు’ అని 38 ఏళ్ల జొకోవిచ్ గుర్తు చేసుకున్నాడు.
వారిద్దరిపై గౌరవం ఉంది...
ఫెడరర్, నాదల్‌లతో ఎన్నో గొప్ప మ్యాచ్‌లలో తలపడ్డానని, ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని జొకో వ్యాఖ్యానించాడు. ‘మైదానంలో ప్రత్యర్థులైనంత మాత్రాన ఎవరినైనా ద్వేషిస్తామా. వారికి కీడు తలపెట్టాలని, ఏం చేసైనా ఓడించాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. గెలుపు కోసమే పోరాడాం. మెరుగైన ఆటగాడే గెలిచాడు. వారిద్దరిపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఒక్క చెడు మాట కూడా మాట్లాడలేదు. ఇకపై కూడా మాట్లాడను’ అని సెర్బియా స్టార్ తమ మనసులో మాట వెల్లడించాడు.
ముగ్గురి ఆట భిన్నం...
జొకోవిచ్ తన ఆటతో పాటు ఫెడరర్, నాదల్ ఆట గురించి కూడా విశ్లేషించాడు. ముగ్గురి ఆట భిన్నంగా ఉంటుందని అతను పోల్చాడు. ‘ఫెడరర్ చాలా ప్రతిభావంతుడు. అతని ఆట చాలా అందంగా అనిపిస్తుంది. అలవోకగా అతను కదిలి షాట్లు ఆడే తీరులో కూడా కళ కనిపిస్తుంది. నాదల్ దీనికి పూర్తిగా భిన్నం. అతని శారీరక సామర్థ్యం అసమానం. దానినే బాగా వాడుకుంటాడు. నా ఆట వీరిద్దరికి మధ్యలో ఉన్నట్లుగా ఉంటుంది. నాదల్ ప్రదర్శనతో నాకు దగ్గరి పోలికలు ఉన్నాయి.
సమయం సాగుతున్నకొద్దీ మా ఆటలో మరిన్ని సొంత ప్రత్యేకతలు వచ్చి చేరాయి. ఒకరి ఆటను మరొకరు అభినందించుకుంటూ ముందుకు సాగాం. ఈ క్రమంలో మాలో పోటీతత్వం పెరిగి ఆట కూడా మరింత మెరుగైంది. వీరిద్దరితో హోరాహోరీ సమరాల్లో తలపడటం నాకు మేలు చేసింది. నా కెరీర్ ముందుకు సాగడంలో నిస్సందేహంగా వారి ప్రభావం ఉంది’ అని ఇటీవల జెనీవా ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో 100 సింగిల్స్ టైటిల్స్ పూర్తి చేసుకున్న జొకోవిచ్ వివరించాడు.