
మరో గ్రాండ్‌స్లామ్ వేటలో అల్‌కరాజ్, సినెర్
గాఫ్, కీస్ మధ్య పోటీ
నేటి నుంచి యూఎస్ ఓపెన్ సింగిల్స్
న్యూయార్క్: పురుషుల టెన్నిస్‌లో 2023నుంచి జరిగిన గత 11 గ్రాండ్‌స్లామ్‌లలో 8 టైటిల్స్‌ను యానిక్ సినెర్, కార్లోస్ అల్‌కరాజ్ పంచుకోగా...మరో మూడు ట్రోఫీలు జొకోవిచ్ ఖాతాలో చేరాయి. అయితే ఈ ఏడాది తాజా ఫామ్‌ను, గత రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ప్రదర్శనను బట్టి చూస్తే సినెర్, అల్‌కరాజ్ మరో టైటిల్ వేటలో హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు తన 25వ గ్రాండ్‌స్లామ్ కోసం తీవ్రంగా పోరాడుతున్న జొకోవిచ్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్ పోటీలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే 2025 చివరి గ్రాండ్‌స్లామ్‌ను ఎవరు సొంత చేసుకుంటారనేది ఆసక్తిరం. అల్‌కరాజ్ (స్పెయిన్) తొలి రౌండ్‌లో భారీ సర్వీస్‌లకు పెట్టింది పేరయిన 7 అడుగుల రీలీ ఒపెల్కా (యూఎస్)ను ఎదుర్కోనున్నాడు. ఇటీవలే జొకోవిచ్, డి మినార్, రూన్‌లను ఓడించిన రికార్డు ఒపెల్కాకు ఉంది. ఆ తర్వాత ముందంజ వేస్తే అల్‌కరాజ్‌కు ప్రిక్వార్టర్స్‌లో 2021 చాంప్ మెద్వెదెవ్ ఎదురయ్యే అవకాశం ఉంది.
తొలి రౌండ్‌లో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో సినెర్ (ఇటలీ) తలపడతాడు. క్వార్టర్స్ వరకు వెళితే జేక్ డ్రేపర్ (యూకే) అతనికి ఎదురు పడతాడు. ఈ టాప్ ప్లేయర్లతో పాటు తాజా సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్న ఇతర ఆటగాళ్లు జాకబ్ మెన్‌సిక్, హోల్గర్ రూన్, కాస్పర్ రూడ్, టియాఫో, ఫ్రిట్జ్, బబ్లిక్ తదితరులు కూడా తమ తొలి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సబలెంకా జోరు సాగేనా...
మహిళల విభాగంలో టైటిల్ వేటలో డిఫెండింగ్ చాంపియన్ సబలెంకా (బెలారస్) మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమైంది. రెబెకా మసరోవా (స్విట్జర్లాండ్)తో జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌తో ఆమె తన పోరును మొదలు పెడుతుంది. అయితే ఈ సారి సొంతగడ్డపై ట్రోఫీని గెలిచేందుకు అమెరికా అమ్మాయిల మధ్యే గట్టి పోటీ ఉంది. కోకో గాఫ్, మాడిసన్ కీస్, జెస్సికా పెగులా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2023లో గాఫ్ ఇక్కడ విజేతగా నిలిచింది.
వరల్డ్ నంబర్ 2 స్వియాటెక్ (పోలండ్) తొలి రౌండ్‌లో ఎమీలియానా అరాంగో (కొలంబో)ను ఎదుర్కొంటుంది. ఇదే క్రమంలో ముందంజ వేస్తే ఆమెకు తాను వింబుల్డన్ ఫైనల్లో చిత్తు చేసిన అనిసిమోవా (అమెరికా) ఎదురవుతుంది. జాస్మిన్ పొవొలిని, మిరా ఆండ్రీవా, ఎమా నవరో కూడా సంచలనాన్ని ఆశిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కించుకున్న సీనియర్ ప్లేయర్, మాజీ చాంపియన్ వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లో కరోలినా ముకోవాను ఎదుర్కొంటుంది.
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో షరపోవా
ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మాజీ స్టార్ మారియా షరపోవాకు చోటు దక్కింది. ఆమెతో పాటు పురుషుల డబుల్స్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన ‘బ్రైన్ బ్రదర్స్’ను ఇందులో చేరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది. రష్యాకు చెందిన 38 ఏళ్ల షరపోవా కెరీర్‌లో ఐదు సింగిల్స్ గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుంది. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను కూడా సాధించిన 10 మంది మహిళా ప్లేయర్లలో షరపోవా కూడా ఉంది.
డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ కు చేరిన తొలి రష్యా మహిళగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తన ఆటతో పాటు అందంతో ప్రపంచ టెన్నిస్‌లో స్టార్‌గా వెలిగింది. 2020లో ఆమె ఆటనుంచి రిటైరైంది. అమెరికాకు చెందిన కవల సోదరులు బాబ్ బ్రైన్, మైక్ బ్రైన్ టెన్నిస్ ప్రపంచంలో ‘బ్రైన్ బ్రదర్స్’గా ఆడిన సంచలన రికార్డులను నెలకొల్పారు.
వీరిద్దరు జోడీగా 119 డబుల్స్ టైటిల్స్ గెలవగా...ఇందులో 16 గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి. ప్రతీ గ్రాండ్‌స్లామ్‌ను కనీసం రెండు సార్లు నెగ్గి వీరు డబుల్ కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను సాధించారు. ఈ జంట ఏకంగా 438 వారాలు వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగడం విశేషం.