
రికర్వ్ విభాగంలో భారత పురుషుల ఆర్చరీ జట్టుకు నిరాశ
కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సెమీస్ చేరిన మధుర, రిషభ్
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్‌లో భారత రికర్వ్ పురుషుల, మహిళల జట్లు పతకం సాధించడంలో విఫలమయ్యాయి. ధీరజ్ బొమ్మదేవర (ఆంధ్రప్రదేశ్), అతాను దాస్ (బెంగాల్), తరుణ్‌దీప్ రాయ్ (సిక్కిం)లతో కూడిన భారత పురుషుల జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకోగా... దీపిక కుమారి (జార్ఖండ్), అంకిత (బెంగాల్), అన్షిక కుమారి (బిహార్)లతో కూడిన భారత మహిళల జట్టు మాత్రం రెండో రౌండ్‌లోనే వెనుదిరిగింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్లు మధుర (మహారాష్ట్ర), రిషభ్ యాదవ్ (హరియాణా) సెమీఫైనల్ చేరుకొని పతకాల వేటలో నిలిచారు.
క్రిస్టియన్ స్టాడర్డ్, బ్రాడీ ఎలీసన్, జాక్ విలియమ్స్‌లతో కూడిన అమెరికా జట్టుతో కాంస్య పతక మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–5 సెట్ పాయింట్లతో ఓడిపోయింది. తొలి సెట్‌ను అమెరికా 57–56తో నెగ్గి 2 పాయింట్లు సాధించింది. రెండో సెట్ 56–52తో అమెరికా ఖాతాలోనే వెళ్లింది. అమెరికా ఆధిక్యం 4–0కు పెరిగింది. మూడో సెట్‌ను భారత్ 55–54తో గెలిచి 2 పాయింట్లు సంపాదించింది. నాలుగో సెట్‌లో రెండు జట్లు 56–56తో సమంగా నిలిచాయి. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది. ఓవరాల్‌గా అమెరికా 5–3తో విజయాన్ని ఖరారు చేసుకొని కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు భారత జట్టు 5–4తో (53–51, 55–58, 55–56, 54–53, 29–27) కజకిస్తాన్‌పై గెలిచింది. నాలుగు సెట్‌ల తర్వాత రెండు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. దాంతో ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... భారత్ పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 6–0తో (58–56, 57–56, 55–53)తో ఇటలీపై నెగ్గింది. సెమీఫైనల్లో టీమిండియా 4–5తో (51–54, 50–56, 56–55, 55–53, 25–26) ‘షూట్ ఆఫ్’లో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయింది.
తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన భారత మహిళల జట్టు 4–5తో (49–50, 52–54, 52–45, 55–48, 26–27)తో ‘షూట్ ఆఫ్’లో అలెజాంద్రా వలెన్సియా, వాలెంటీనా వాజ్‌క్వెజ్, మోంటాయ అల్ఫారోలతో కూడిన మెక్సికో జట్టు చేతిలో ఓడిపోయింది.
చికిత, జ్యోతి సురేఖలకు నిరాశ
మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణ క్రీడాకారిణి తనిపర్తి చికిత, ప్రపంచ చాంపియన్ అదితి స్వామి నిరాశపరచగా... మధుర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో మధుర 142–141తో జ్యోతి సురేఖను ఓడించింది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో చికిత 134–138తో అదెల్ జెక్సెన్‌బినోవా (కజకిస్తాన్) చేతిలో, అదితి 129–140తో కార్సన్ క్రాహి (అమెరికా) చేతిలో ఓడిపోయారు.
పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్లో రిషభ్ డెన్మార్క్‌కు చెందిన మథియాస్ ఫులర్టన్‌పై గెలిచాడు. నిర్ణీత 15 బాణాల తర్వాత ఇద్దరూ 147–147తో సమంగా నిలిచారు. ‘షూట్ ఆఫ్’లోనూ ఇద్దరూ 10 పాయింట్లు స్కోరు చేశారు. అయితే రిషభ్ సంధించిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంగా ఉండటంతో అతనికి సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది.