సెమీఫైనల్లోకి డిఫెండింగ్ చాంపియన్
క్వార్టర్స్‌లో 3–1 తేడాతో స్విట్జర్లాండ్‌పై విజయం
కాన్సస్ సిటీ: ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా చేరువైంది. లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఈ మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం జరిగిన చివరిదైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 3–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ జట్టును ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలువడంతో... విజేతను నిర్ణయించేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో అర్జెంటీనా రెండు గోల్స్ సాధించి ప్రపంచకప్ చరిత్రలో ఏడోసారి సెమీఫైనల్‌కు చేరుకుంది.
అర్జెంటీనా తరఫున అలెక్సిస్ మాక్ అలిస్టర్ (10వ నిమిషంలో), జూలియన్ అల్వారెజ్ (112వ నిమిషంలో), లౌటారో మార్టినెజ్ (120+1వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. స్విట్జర్లాండ్ జట్టుకు డాన్ ఎండోయో (67వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 72వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ బ్రీల్ ఎంబోలో ‘రెడ్ కార్డు’కు గురయ్యాడు. దాంతో మిగిలిన మ్యాచ్ మొత్తం స్విట్జర్లాండ్ పదిమంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ టోర్నీలో మొదటి ఐదు మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన మెస్సీ ఈ మ్యాచ్‌లో మాత్రం గోల్ చేయలేదు. అయితే అలెక్సిస్ తొలి గోల్ చేసేందుకు మెస్సీ సహాయపడ్డాడు.
గత మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అర్జెంటీనా ఏమాత్రం ఆందోళన చెందకుండా విజయమే లక్ష్యంగా చివరి క్షణం వరకు పోరాడింది. ఈ పోరాట ఫలితమే అర్జెంటీనా జట్టుకు సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసింది. స్విట్జర్లాండ్‌తో పోరులో అర్జెంటీనా 22 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేసి ఏడుసార్లు గోల్ లక్ష్యంగా షాట్‌లు కొట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి గం. 12:30 నుంచి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో అర్జెంటీనా తలపడుతుంది. గతంలో సెమీఫైనల్ చేరుకున్న ఆరు పర్యాయాలు (1930, 1978, 1986, 1990, 2014, 2022) అర్జెంటీనా జట్టు ఫైనల్లోకి ప్రవేశించడంతోపాటు మూడుసార్లు విజేతగానూ నిలిచింది. ఏడోసారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి.
12 ప్రపంచకప్‌లో వరుసగా 12 మ్యాచ్‌ల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన తొలి జట్టుగా అర్జెంటీనా రికార్డు నెలకొల్పింది. 72 ఏళ్లుగా ఉరుగ్వే (1930 నుంచి 1954 వరకు; వరుసగా 11 మ్యాచ్‌ల్లో ) పేరిట ఉన్న రికార్డును అర్జెంటీనా బద్దలు కొట్టింది.
4 అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య 1992లో వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక... తొలిసారి ప్రపంచకప్‌లో టాప్–4 జట్లు సెమీఫైనల్ చేరాయి. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఫ్రాన్స్ తొలి స్థానంలో, స్పెయిన్ రెండో స్థానంలో, అర్జెంటీనా మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
బెలింగ్‌హమ్ ‘డబుల్’ ధమాకా...
నార్వేను ఓడించి సెమీస్‌లోకి ఇంగ్లండ్
మయామి స్టేడియంలో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో నార్వే జట్టును ఓడించి ప్రపంచకప్‌లో నాలుగోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేత ఎవరో తేలేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. ఈ అదనపు సమయంలో ఇంగ్లండ్ ఒక గోల్ సాధించి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నమోదు చేసిన రెండు గోల్స్ జూడ్ బెలింగ్‌హమ్ (45+2వ నిమిషంలో, 93వ నిమిషంలో) సాధించడం విశేషం.

నార్వే జట్టుకు ఆండ్రీస్ షాజెల్డర్ప్ (36వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 56వ నిమిషంలో నార్వే ప్లేయర్ టార్బన్ హెగెమ్ చేసిన గోల్‌ను రిఫరీ వీడియో రీప్లే సమీక్షించాక నిరాకరించారు. ‘డి’ ఏరియాలో నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఫౌల్ చేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో ఏడు గోల్స్‌తో అదరగొట్టిన నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఎర్లింగ్‌ను ఇంగ్లండ్ ప్లేయర్లు వ్యూహత్మంగా కట్టడి చేశారు.
ఫలితంగా ఎర్లింగ్ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్‌లు కొట్టాడు. దాంతో నిర్ణీత సమయం ముగిశాక నార్వే కోచ్ ఎర్లింగ్‌ను వెనక్కి పిలిచి అతని స్థానంలో లార్సన్‌ను సబ్‌స్టిట్యూట్‌గా ఆడించారు. 1966లో ఏకైకసారి ఇంగ్లండ్ ప్రపంచకప్ సాధించగా... 1990 సెమీఫైనల్లో జర్మనీ చేతిలో... 2018 సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది.


