
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేను భారత మహిళల జట్టు గెలుచుకోవడంలో దీప్తి శర్మ ప్రధాన పాత్ర పోషించింది. ఆఫ్‌స్పిన్నర్‌గా జట్టు బౌలింగ్ బృందంలో రెగ్యులర్ సభ్యురాలైన దీప్తి... బ్యాటర్‌గా లోయర్ ఆర్డర్‌లో అనేక మార్లు కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీప్తి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ జట్టును విజయం వరకు తీసుకెళ్లింది.
28వ ఓవర్లో 127/4 వద్ద క్రీజ్‌లోకి వచ్చిన ఆమె 62 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 పరుగులు సాధించి చివరి వరకు అజేయంగా నిలిచింది. లారెన్ బెల్ బౌలింగ్‌లో దీప్తి ఒంటి చేత్తో కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది.
‘ఇన్నేళ్ల నా కెరీర్‌లో చాలా సందర్భాల్లో ఇలాంటి స్థితిలోనే బరిలోకి దిగాను. నేను ఎంత ప్రశాంతంగా ఉండగలనో నాకు బాగా తెలుసు. కాబట్టి ఏమాత్రం ఒత్తిడికి గురి కాలేదు. ఈసారి కూడా అదే కీలకంగా మారింది. జెమీమాతో భాగస్వామ్యం నెలకొల్పడంపై ముందుగా దృష్టి పెట్టాను. మా పార్ట్‌నర్‌షిప్ జట్టు గెలుపు వరకు తీసుకెళుతుందని నేను నమ్మాను.
నేను చివరి వరకు నిలిస్తే విజయం ఖాయమవుతుందని తెలుసు. జెమీమా తర్వాత రిచా, అమన్ కూడా బాగా సహకరించారు. ఒంటి చేత్తో సిక్సర్ కొట్టడం రిషభ్ పంత్‌ను చూసి నేర్చుకున్నాను’ అని మ్యాచ్ అనంతరం దీప్తి శర్మ వ్యాఖ్యానించింది.
ఇంగ్లండ్ పేసర్ ఫైలర్ షార్ట్ పిచ్ బంతులతో పన్నిన వ్యూహానికి తాము సిద్ధంగా ఉండటం వల్లే ఎలాంటి సమస్యా రాలేదని దీప్తి పేర్కొంది. ఆమె కెరీర్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం 20వసారి కాగా... మొదటిసారి బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయకుండా కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే ఆమె ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం.
త్వరలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆల్‌రౌండర్‌గా ఆమె కీలకం కానుంది. ‘మా జట్టు ఇటీవల వరుసగా చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తోంది. శ్రీలంకతో ముక్కోణపు టోర్నీ గెలిచాక ఇక్కడ కూడా బాగా రాణిస్తున్నాం. వరల్డ్ కప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. దాని గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు.
ప్రస్తుతం ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం’ అని దీప్తి పేర్కొంది. తొలి వన్డేలో 4 వికెట్లతో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ సిరీస్‌లో 1–0తో ముందంజ వేయగా... రేపు లార్డ్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతుంది.