
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో దబంగ్ ఢిల్లీ విజయాల పరంపర కొనసాగుతోంది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా చెలరేగిపోతున్న అశు మలిక్ సారథ్యంలోని దబంగ్ ఢిల్లీ లీగ్‌లో 11వ విజయం అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ ‘టైబ్రేక్’లో 9–3తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో రెండు జట్ల స్కోర్లు 33–33తో సమం కాగా... విజేతను నిర్ణయించేందుకు ‘5 రెయిడ్స్’ నిర్వహించారు.
ఇందులో ఢిల్లీ 9 పాయింట్లతో సత్తాచాటగా... స్టీలర్స్ 3 పాయింట్లకే పరిమితమైంది. స్టీలర్స్‌కు ఇది వరుసగా నాలుగో పరాజయం. నిర్ణీత సమయంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున అజింక్య పవార్ 8 పాయింట్లు సాధించగా... నీరజ్, సౌరభ్ చెరో 6 పాయింట్లతో రాణించారు. స్టీలర్స్ తరఫున శివమ్ పతారే 10 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 11 విజయాలు, 1 పరాజయంతో 22 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’ ప్లేస్‌లో కొనసాగుతోంది.
స్టీలర్స్ 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో 12 పాయింట్లు సాధించి పట్టిక ఆరో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 56–37 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్‌పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 26 పాయింట్లతో విజృంభించగా... పట్నా పైరెట్స్ తరఫున అయాన్ 16, అంకిత్ 14 పాయింట్లు సాధించారు. వీరిద్దరు మినహా తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోవడంతో పైరెట్స్ ఓటమి తప్పలేదు. లీగ్‌లో భాగంగా బుధవారం హరియాణా స్టీలర్స్‌తో తెలుగు టైటాన్స్, యు ముంబాతో పుణేరి పల్టన్ తలపడనున్నాయి.