దబంగ్‌ ఢిల్లీ దూకుడు | Dabang Delhi win over Jaipur Pink Panthers | Sakshi
Sakshi News home page

దబంగ్‌ ఢిల్లీ దూకుడు

Nov 23 2024 3:59 AM | Updated on Nov 23 2024 3:59 AM

Dabang Delhi win over Jaipur Pink Panthers

జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం  

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో దబంగ్‌ ఢిల్లీ 35–21 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. దబంగ్‌ ఢిల్లీ తరఫున స్టార్‌ రెయిడర్‌ అశు మలిక్‌ 9 పాయింట్లతో సత్తా చాటగా.. యోగేశ్‌ దహియా 5 పాయింట్లు సాధించాడు.  జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 7 పాయింట్లతో పోరాడినా అతడికి సహచరుల నుంచి సరైన తోడ్పాటు లభించలేదు. 

లీగ్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన దబంగ్‌ ఢిల్లీ 6 విజయాలు, 5 పరాజయాలు, 2 ‘టై’లతో 40 పాయింట్లు ఖాతాలో వేసుకొని మూడో స్థానానికి చేరింది. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ 40–24 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై గెలుపొందింది. యూపీ యోధాస్‌ రెయిడర్‌ భవానీ రాజ్‌పుత్‌ 10 పాయింట్లతో విజృంభించగా... డిఫెన్స్‌లో హితేశ్‌ 6 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. 

తమిళ్‌ తలైవాస్‌ తరఫున విశాల్‌ చాహల్, నితీశ్‌ కుమార్‌ చెరో ఆరు పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్‌లో 5 విజయం నమోదు చేసుకున్న యూపీ యోధాస్‌ 33 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరగా... గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగో పరాజయం మూటగట్టుకున్న తమిళ్‌ తలైవాస్‌ 28 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా శనివారం గుజరాత్‌ జెయింట్స్‌తో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 8 గంటకు), జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో హరియాణా స్టీలర్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  

Advertisement
 
Advertisement
Advertisement