ప్రపంచకప్‌లో నేడు కీలక సమరం.. ఆసీస్‌తో పాక్‌ 'ఢీ' | ODI World Cup 2023: AUS Vs PAK: Pakistan Take On Australia In Crucial Match At Bengaluru- Sakshi
Sakshi News home page

CWC 2023: ప్రపంచకప్‌లో నేడు కీలక సమరం.. ఆసీస్‌తో పాక్‌ 'ఢీ'

Published Fri, Oct 20 2023 12:38 PM

CWC 2023: Pakistan Take On Australia In Crucial Match At Bengaluru - Sakshi

వన్డే ప్రపంచకప్‌ 2023లో ఇవాళ (అక్టోబర్‌ 20) అత్యంత కీలక సమరం జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు ఈ మ్యాచ్‌ బరిలోకి దిగనున్నాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకం కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించకుంది. 

పాక్‌తో పోలిస్తే ఆసీస్‌కే అత్యంత కీలకం
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు చెరి 3 మ్యాచ్‌లు ఆడగా.. పాక్‌ రెండింటిలో, ఆస్ట్రేలియా ఓ మ్యాచ్‌లో గెలుపొందాయి. ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట ఓడిన ఆసీస్‌కు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం కానుంది. పాక్‌తో పోలిస్తే ఆసీస్‌కు ఈ మ్యాచ్‌లో విజయం చాలా అవసరం. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. 

సెమీస్‌ రేసులో న్యూజిలాండ్‌, భారత్‌ ముందంజ..
సెమీస్‌ రేసులో న్యూజిలాండ్‌, భారత్‌లు ముందంజలో ఉండగా.. సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్‌ టాప్‌-4లోకి చేరి సెమీస్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా పాక్‌ను ఓడించాలి. 

ఆరో స్థానంలో ఆసీస్‌.. నాలుగో ప్లేస్‌లో పాక్‌
భారత్‌, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడి శ్రీలంకపై కంటితుడుపు విజయాన్ని సాధించిన ఆసీస్‌.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌ తర్వాత ఆరో స్థానంలో ఉండగా.. నెదర్లాండ్స్‌, శ్రీలంకలను ఓడించి, భారత్‌ చేతిలో ఓడిన పాక్‌ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపోటములు పాయింట్ల పట్టికలో స్థానాలను తారుమారు చేయడంతో పాటు సెమీస్‌ బెర్తులపై ఓ అవగాహణ తీసుకువస్తాయి.

పాక్‌కు ముందుంది ముసళ్ల పండగ..
ఇప్పటివరకు నెదర్లాండ్స్‌, శ్రీలంక లాంటి చిన్న జట్లను ఓడించిన పాక్‌.. తదుపరి మ్యాచ్‌ల్లో (ఆసీస్‌తో మ్యాచ్‌ కాక) సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ లాంటి పటిష్టమైన జట్లతో పాటు చిన్న జట్లైన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌లను ఢీకొట్టాల్సి ఉంది. 

ఆసీస్‌ విషయానికొస్తే.. భారత్‌, సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్ల చేతుల్లో ఓడి, శ్రీలంకపై విజయం సాధించిన ఆసీస్‌.. తదుపరి మ్యాచ్‌ల్లో (పాక్‌తో మ్యాచ్‌ కాకుండా) చిన్న జట్లైన నెదర్లాండ్స్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ లాంటి పటిష్టమైన జట్లతో తలపడాల్సి ఉంది. 

ఎవరిది పై చేయి..?
వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్‌లు జరగ్గా ఆరింట ఆస్ట్రేలియా, నాలుగు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరి వరల్డ్‌కప్‌లో (2019) జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ విజయం సాధించింది. 

తుది జట్లు (అంచనా)..
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

పాకిస్తాన్‌: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్‌), మహ్మద్ రిజ్వాన్(వికెట్‌కీపర్‌), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

Advertisement
 
Advertisement
 
Advertisement