County Championship: పుజారా మరో సెంచరీ.. పరుగుల వరద పారిస్తున్న నయా వాల్‌

County Championship: Cheteshwar Pujara Follows Up Double Ton With A Century - Sakshi

Pujara Scores Century Followed By Double Ton: పేలవ ఫామ్‌ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన చతేశ్వర్‌ పుజరా ఇంగ్లండ్‌ కౌంటీల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఈ సీజన్లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న నయా వాల్‌ వరుస శతకాలతో పరుగుల వరద పారిస్తున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్‌లో భాగంగా డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ (రెండో ఇన్నింగ్స్‌) సాధించిన అతను.. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. వరుస ఇన్నింగ్స్‌ల్లో మూడంకెల స్కోర్‌ను రీచైన పుజారా ఎట్టకేలకు పూర్వపు ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. 

డెర్బిషైర్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటైన పుజారా.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేశాడు. సూపర్‌ ఫామ్‌కు కొనసాగింపుగా వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 206 బంతులను ఎదుర్కొన్న నయా వాల్‌.. 16 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. పుజారా ఒక్కడే సొగసైన సెంచరీతో రాణించడంతో ససెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌటైంది.  

ఇదే జట్టు తరఫున ఆడుతున్న పాక్‌ వికెట్‌కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తొలి బంతికే డకౌట్‌ కాగా, టామ్‌ క్లార్క్‌ (44) కాస్త పర్వాలేదనిపించాడు. అంతకుముందు వార్సెస్టర్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 491 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ జట్టు కెప్టెన్‌ బ్రెట్‌ డిఒలివియెరా అజేయమైన 169 పరుగులతో సత్తా చాటగా, ఎడ్‌ పొలాక్‌ (77), బెర్నార్డ్‌ (75) అర్ధ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయిన ససెక్స్‌ ఫాలో ఆన్‌ ఆడుతుంది. 
చదవండి: ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా..? నో బాల్‌ వివాదంపై ఆసక్తికర చర్చ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top