
పాకిస్తాన్ జాతీయ జట్టులో చోటు కోల్పోయిన స్టార్ ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్.. ఇంగ్లండ్ గడ్డపై మాత్రం అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్ 2025లో యార్క్‌షైర్ తరపున ఆడుతున్న ఇమామ్ పరుగుల వరద పారిస్తున్నాడు.
ఆదివారం హోవ్ కౌంటీ గ్రౌండ్ వేదికగా ససెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇమామ్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 286 పరుగుల లక్ష్య చేధనలో ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇమామ్ 105 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు.
అతడితో పాటు జేమ్స్ వార్టన్(85), మాథ్యూ రేవిస్(39), జార్జ్(31) రాణించారు. దీంతో 285 పరుగుల లక్ష్యాన్ని యార్క్‌షైర్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 47.4 ఓవర్లలో చేధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో ఓలీవర్ కార్టర్(94), సింమ్సాన్(65), డానీ లంబ్(53) రాణించారు. యార్క్‌షైర్ బౌలర్లలో మిల్నెస్ 7 వికెట్లతో చెలరేగాడు.
ఇమామ్ రీ ఎంట్రీ ఇస్తాడా?
ఇంగ్లాండ్ దేశవాళీ వన్డే కప్ 2025లో ఇమామ్ ఉల్ హాక్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఇమామ్.. 102.60 సగటుతో 513 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో అతడికి ఇది మూడో సెంచరీ కావడం గమనార్హం.
దీంతో ఇమామ్ తిరిగి పాక్ వన్డే జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇమామ్ చివరగా ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ తరపున ఆడాడు. మూడు మ్యాచ్‌లలోనూ అతడు విఫలమయ్యాడు. దీంతో వెస్టిండీస్‌తో జరిగిన వైట్-బాల్ సిరీస్‌లకు అతడిని పక్కన పెట్టారు.
చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వారే: ఛతేశ్వర్ పుజారా