
టీమిండియా టెస్టు స్పెషలిస్టుగా సేవలు అందించిన ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఆటకు అల్విదా చెప్పాడు. 2010 నుంచి 2023 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఈ సౌరాష్ట్ర బ్యాటర్.. తన కెరీర్‌లో 103 టెస్టులు ఆడాడు. మొత్తంగా 16217 బంతులు ఎదుర్కొని 7195 పరుగులు సాధించాడు.
ఇందులో పందొమ్మిది శతకాలు, మూడు డబుల్ సెంచరీలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక తన కెరీర్‌లో కేవలం ఐదు వన్డేలే ఆడిన పుజారా.. 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) వారసుడిగా, ‘నయా వాల్’ ప్రసిద్ధి పొందిన పుజారా.. విదేశీ గడ్డపై ముఖ్యంగా SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ఉత్తమంగా రాణించాడు.
ఆ నలుగురు.. టఫెస్ట్
ఈ నేపథ్యంలో పుజారా తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ల గురించి తాజాగా వెల్లడించాడు. సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ బౌలింగ్‌లో తాను పరుగులు రాబట్టేందుకు ఇబ్బందిపడేవాడినని తెలిపాడు. అదే విధంగా.. ఇంగ్లండ్ పేస్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్, ఆస్ట్రేలియా టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ (Pat Cummins)ను ఎదుర్కోవడం కష్టమని పుజ్జీ పేర్కొన్నాడు.
వారి బౌలింగ్‌లో పుజ్జీ బ్యాటింగ్ సగటు ఇలా
కాగా సౌతాఫ్రికాతో 17 టెస్టులు ఆడిన పుజారా సగటు కేవలం 30.41. స్టెయిన్ బౌలింగ్‌లో అతడి బ్యాటింగ్ సగటు 30. అదే విధంగా.. మోర్కెల్ బౌలింగ్‌లో 19. ఈ ఇద్దరు పుజారాను చెరో ఆరుసార్లు అవుట్ చేశారు.
ఇక ఆండర్సన్ బౌలింగ్‌లో పుజారా బ్యాటింగ్ సగటు 21.80 కాగా.. టెస్టుల్లో 12 సార్లు అతడు పుజ్జీ వికెట్ దక్కించుకున్నాడు. ఇక కమిన్స్ బౌలింగ్‌లో పుజారా బ్యాటింగ్ యావరేజ్ 22.50. కమిన్స్ పుజారాను ఎనిమిది సార్లు అవుట్ చేశాడు.
ఆసీస్.. వెరీ వెరీ స్పెషల్
అయితే, ఓవరాల్‌గా ఆస్ట్రేలియాపై పుజారా బ్యాటింగ్ సగటు మాత్రం 47.28గా ఉండటం విశేషం. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ గెలవడంలో పుజ్జీది కీలక పాత్ర. ఈ సిరీస్‌లో 1258 బంతులు ఎదుర్కొన్న పుజారా.. 521 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
కాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జన్మించిన 37 ఏళ్ల పుజారా.. 2010లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇక ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తన చివరి టెస్టు కూడా ఆసీస్ మీదే ఆడటం విశేషం. ఇంగ్లండ్ వేదికగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో పుజారా ఆఖరిగా టీమిండియా జెర్సీలో కనిపించాడు. ప్రస్తుతం అతడు కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: Asia Cup 2025: 'టీమిండియాపై విజయం మాదే'.. మీకు అంత సీన్ లేదులే! పాక్ బౌలర్‌కు కౌంటర్