గెలుపు వాకిట్లో భారత్‌ | India are 58 runs away from victory in second test | Sakshi
Sakshi News home page

గెలుపు వాకిట్లో భారత్‌

Oct 14 2025 4:11 AM | Updated on Oct 14 2025 4:11 AM

India are 58 runs away from victory in second test

విజయానికి 58 పరుగులే దూరం

‘శత’క్కొట్టిన క్యాంప్‌బెల్, షై హోప్‌

రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ 390 ఆలౌట్‌

భారత్‌ లక్ష్యం 121; ప్రస్తుతం 63/1

వెస్టిండీస్‌పై రెండో టెస్టు గెలిచేందుకు, సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు భారత్‌ 58 పరుగుల దూరంలోనే ఉంది. ఆఖరి రోజు లంచ్‌ బ్రేక్‌కు ముందే ఈ లాంఛనం పూర్తి చేసేందుకు సిద్ధమైంది. అంతకుముందు వెస్టిండీస్‌ చాన్నాళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు క్రికెట్‌లో పోరాడింది. నిర్జీవమైన పిచ్‌పై ఓవర్‌నైట్‌ బ్యాటర్లు క్యాంప్‌బెల్, షై హోప్‌ ఇద్దరు శతకాల మోత మోగించడంతో భారత్‌ లక్ష్యఛేదనకు దిగాల్సి వచి్చంది. ఫలితంగా మ్యాచ్‌ ఐదో రోజుకు చేరింది.  

న్యూఢిల్లీ: భారత్‌ ఆఖరి టెస్టులో గెలుపు వాకిట నిలిచింది. మంగళవారం ఉదయం ఆ లాంఛనాన్ని పూర్తిచేస్తే చాలు టీమిండియా రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్‌ చేస్తుంది. ఎట్టకేలకు వెస్టిండీస్‌ బ్యాటర్లు భారత బౌలర్లకు పని పెట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో కఠిన సవాళ్లు విసిరారు. తొలి టెస్టును మూడే రోజుల్లో ముగించిన ఆతిథ్య జట్టు... స్పిన్‌కు అచ్చొచ్చే ఢిల్లీ పిచ్‌ ఈసారి నిర్జీవంగా మారడంతో వికెట్లు తీసేందుకు చెమటోడ్చింది.

పేసర్లు బుమ్రా (3/44), సిరాజ్‌ (2/43), స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ (3/104), రవీంద్ర జడేజా (1/102), వాషింగ్టన్‌ సుందర్‌ (1/80) సమష్టిగా రాణించారు. స్పిన్‌ త్రయం 5, పేస్‌ ద్వయం 5 ఇలా చెరో సగం వికెట్లతో ప్రత్యర్థి జట్టును కూల్చారు. దీంతో వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 118.5 ఓవర్లలో 390 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ జాన్‌ క్యాంప్‌బెల్‌ (199 బంతుల్లో 115; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), షై హోప్‌ (214 బంతుల్లో 103; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. 

అనంతరం 121 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (8) అవుటవ్వగా, కేఎల్‌ రాహుల్‌ (54 బంతుల్లో 25 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), సాయి సుదర్శన్‌ (47 బంతుల్లో 30 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. చేతిలో 9 వికెట్లున్న భారత్‌ విజయానికి ఇంకా 58 పరుగులు కావాలి. 

కదంతొక్కిన హోప్, క్యాంప్‌బెల్‌ 
ఓవర్‌నైట్‌ స్కోరు 173/2తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కరీబియన్‌ బ్యాటర్లు క్యాంప్‌బెల్, హోప్‌ కదంతొక్కారు. పేస్, స్పిన్‌ బౌలింగ్‌పై యథేచ్చగా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ టెస్టు క్రికెట్‌లో తొలి సెంచరీ ముచ్చటను తీర్చుకున్నాడు. 

జడేజా ఓవర్లో భారీ సిక్సర్‌తో క్యాంప్‌బెల్‌ శతకాన్ని సాధించగా, షై హోప్‌ కూడా సెంచరీ దిశగా సాగిపోయాడు. దీంతో ఈ సెషన్‌లో భారత బౌలర్లకు కఠిన పరీక్ష తప్పలేదు. క్యాంప్‌బెల్‌ను జడేజా ఎల్బీగా అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. హోప్‌కు కెపె్టన్‌ రోస్టన్‌ చేజ్‌ జతవ్వగా... విండీస్‌ 252/3 స్కోరు వద్ద లంచ్‌ విరామానికెళ్లింది. రెండో సెషన్‌ మొదలైన కాసేపటికే భారత్‌ కొత్త బంతిని తీసుకుంది. 

నింపాదిగా ఆడుతున్న హోప్‌ కూడా శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చేజ్‌ (72 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో పాతుకుపోవడంతో నాలుగో వికెట్‌ భాగస్వామ్యం కూడా సాఫీగా సాగిపోయింది. ఈ దశలో సిరాజ్‌... హోప్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి 59 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.  

గ్రీవెస్‌ అర్ధశతకం 
తర్వాత కుల్దీప్‌ మ్యాజిక్‌కు స్వల్ప వ్యవధిలోనే 3 వికెట్లు కూలాయి. మొదట ఇమ్లాచ్‌ (13)ను అవుట్‌ చేసిన కుల్దీప్‌ తర్వాతి ఓవర్లో చేజ్, పియర్‌ (0)లను బోల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 300 దాటాక బుమ్రా నిప్పులు చేరగడంతో వారికెన్‌ (3), ఫిలిప్‌ (2)లు నిష్క్రమించారు. దీంతో 311 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కూలింది. ఇక ఆఖరి వికెటే కదా ఆలౌట్‌ తేలికే అనుకుంటే... మిడిలార్డర్‌ బ్యాటర్‌ జస్టిన్‌ గ్రీవెస్‌ (85 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు) మొండిగా పోరాడాడు. 

దీంతో రెండో సెషన్‌ నుంచి ఆఖరి సెషన్‌ వరకు గ్రీవెస్, జేడెన్‌ సీల్స్‌ (67 బంతుల్లో 32; 1 ఫోర్, 1 సిక్స్‌)తో భాగస్వామ్యమే లాక్కొచ్చింది. గ్రీవెస్‌ అర్ధసెంచరీ పూర్తయిన తర్వాత... సీల్స్‌ను బుమ్రా అవుట్‌ చేయడంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. చివరి వికెట్‌కు సీల్స్, గ్రీవెస్‌ ఏకంగా 79 పరుగులు జోడించడం విశేషం. భారత్‌ ముందు వంద పైచిలుకు లక్ష్యానికి, ఐదో రోజు పొడిగింపునకు ఈ భాగస్వామ్యమే కారణమైంది.

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 518/5 డిక్లేర్డ్‌; వెస్టిండీస్‌ తొలిఇన్నింగ్స్‌: 248; వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌: క్యాంప్‌బెల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 115; తేజ్‌ చందర్‌పాల్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 10; అతనేజ్‌ (బి) సుందర్‌ 7; షై హోప్‌ (బి) సిరాజ్‌ 103; చేజ్‌ (సి) సబ్‌–పడిక్కల్‌ (బి) కుల్దీప్‌ 40; ఇమ్లాచ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 12; గ్రీవెస్‌ (నాటౌట్‌) 50; పియర్‌ (సి) నితీశ్‌ రెడ్డి (బి) కుల్దీప్‌ 0; వారికెన్‌ (బి) బుమ్రా 3; ఫిలిప్‌ (సి) జురేల్‌ (బి) బుమ్రా 2; సీల్స్‌ (సి) సుందర్‌ (బి) బుమ్రా 32; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం ( 118.5 ఓవర్లలో ఆలౌట్‌) 390. వికెట్ల పతనం: 1–17, 2–35, 3–212, 4–271, 5–293, 6–298, 7–298, 8–307, 9–311, 10–390. బౌలింగ్‌: సిరాజ్‌ 15–3–43–2, జడేజా 33–10–102–1, సుందర్‌ 23–3–80–1, కుల్దీప్‌ 29–4–104–3, బుమ్రా 17.5–5–44–3, జైస్వాల్‌ 1–0–3–0. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఫిలిప్‌ (బి) వారికెన్‌ 8; రాహుల్‌ (బ్యాటింగ్‌) 25; సాయి సుదర్శన్‌ (బ్యాటింగ్‌) 30; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (18 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 63. వికెట్ల పతనం: 1–9. బౌలింగ్‌: సీల్స్‌ 3–0–14–0, వారికెన్‌ 7–1–15–1, పియర్‌ 6–0–24–0, చేజ్‌ 2–0–10–0. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement