
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇవాళ (అక్టోబర్ 13) బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేసింది.
షర్మిన్ అక్తర్ (50), షోర్నా అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నిగార్ సుల్తానా (32), ఫర్జానా హాక్ (30), రూబ్యా హైదర్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేసినా.. చాలా నిదానంగా ఆడారు. వీరిలో ఫర్జానా మ్యాచ్‌ను చూసే వారికి విసుగు తెప్పించింది.
30 పరుగులు చేసేందుకు ఆమె ఏకంగా 76 బంతులు ఆడింది. రూబ్యా హైదర్ సైతం తాను చేసిన 25 పరుగుల కోసం 52 బంతులను ఎదుర్కొంది. హాఫ్ సెంచరీ చేసినా, షర్మిన్ అక్తర్ కూడా 77 బంతులు ఆడింది. నిగార్ సుల్తానా 42 బంతుల్లో 32 పరుగులు చేసింది.
ఆఖర్లో రితూ మోనీ 8 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. షోర్నా, రీతూ ఆఖర్లో వేగంగా ఆడకపోయుంటే బంగ్లాదేశ్ స్కోర్ 200 కూడా దాటేది కాదు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లో ట్రయాన్, నదినే డి క్లెర్క్ తలో వికెట్ తీశారు.
కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా నాలుగు, బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉన్నాయి.
సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండగా.. బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. సౌతాఫ్రికా కొద్ది రోజుల కిందట జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియాపై విజయం సాధించింది.
చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు