IND VS WI: వీరోచిత శతకాలు​.. చరిత్ర తిరగరాసిన విండీస్‌ బ్యాటర్లు | John Campbell & Shai Hope Make Rare Feat in 2nd Test vs India After 51 Years | Sakshi
Sakshi News home page

IND VS WI: వీరోచిత శతకాలు​.. చరిత్ర తిరగరాసిన విండీస్‌ బ్యాటర్లు

Oct 13 2025 2:57 PM | Updated on Oct 13 2025 3:26 PM

IND VS WI 2ND TEST: TWO WEST INDIES BATTERS SCORING HUNDRED IN INDIA AFTER 51 YEARS IN A SINGLE INNINGS

న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్‌ ఆటగాళ్లు జాన్‌ క్యాంప్‌బెల్‌ (john Campbell), షాయ్‌ హోప్‌ (Shai Hope) ఓ అరుదైన ఘనత సాధించారు. మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఈ ఇద్దరూ.. 51 ఏళ్ల తర్వాత ఓ రికార్డును తిరగరాశారు.

1974లో ఇద్దరు విండీస్‌ ఆటగాళ్లు భారత గడ్డపై ఓ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. 51 ఏళ్ల తర్వాత క్యాంప్‌బెల్‌, హోప్‌ ఆ ఫీట్‌ను పునరావృతం చేశారు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్‌) గార్డన్‌ గ్రీనిడ్జ్‌ (107), క్లైవ్‌ లాయిడ్‌ (163) సెంచరీలు చేశారు.

ఓవరాల్‌గా చూసిన భారత గడ్డపై (భారత్‌పై) ఓ టెస్ట్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరు విండీస్‌ బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారే. 1974కు ముందు 1948-49లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎవర్టన్‌ వీక్స్‌ (101), క్లైడ్‌ వాల్కాట్‌ (108) సెంచరీలు చేశారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే ఆలౌటై, ఫాలో ఆన్‌ ఆడుతున్న విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తుంది. వాస్తవానికి తొలి టెస్ట్‌ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ విండీస్‌ ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయంపాలవుతుందని అంతా అనుకున్నారు.

అయితే క్యాంప్‌బెల్‌ (115), హోప్‌ (103) సూపర్‌ సెంచరీలతో అసమానమైన పోరాటపటిమ కనబర్చి తమ జట్టుకు ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 187 పరుగులు జోడించి, టీమిండియా బ్యాటర్లను రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగేలా చేశారు.

నాలుగో రోజు టీ సమయానికి విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసి 91 ఆధిక్యంలో ఉంది. జస్టిన్‌ గ్రీవ్స్‌ (35), జేడన్‌ సీల్స్‌ (18) టీమిండియా బౌలర్ల సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కుల్దీప్‌ 3, సిరాజ్‌ 2, జడేజా, సుందర్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు ఇన్నింగ్స్‌లో విండీస్‌, కుల్దీప్‌ యాదవ్‌ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్‌ అథనాజ్‌ (41) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. యశస్వి జైస్వాల్‌ (175), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (129 నాటౌట్‌) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్‌ (518/5 డిక్లేర్‌) చేసింది. సాయి సుదర్శన్‌ (87) సెంచరీని మిస్‌ చేసుకోగా.. కేఎల్‌ రాహుల్‌ 38, నితీశ్‌ రెడ్డి 43, జురెల్‌ 44 పరుగులు చేశారు. 

కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.

చదవండి: Vaibhav Suryavanshi: వైస్‌ కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement