
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్‌లలో ఇది ఒకటి. ఓవల్ వేదికగా జరిగిన హోరాహోరీ సమరంలో ఇంగ్లండ్పై భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని మునివేళ్లపై నిలబెట్టింది. ఆట చివరి రోజు భారత బౌలర్లు ధీరత్వాన్ని ప్రదర్శించి 35 పరుగుల స్వల్ప లక్ష్నాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్లుండగా.. సిరాజ్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి నోటి కాడి గెలుపును లాగేసుకున్నాడు. ప్రసిద్ద్ కృష్ణ తన వంతుగా ఓ వికెట్ తీశాడు.
374 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓ దశలో పటిష్టమైన స్థితిలో (301/3) ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు వదులుకోకుండా వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా సిరాజ్ ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదన్నట్లు ముందుకు సాగాడు. ఈ గెలుపులో సిరాజ్‌ది ప్రధానపాత్ర. ఈ హైదరాబాదీ పేసర్ అసలుసిసలైన పోరాట యోధుడిలా పోరాడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు సహా, మ్యాచ్ మొత్తంలో తొమ్మిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
కాగా, ఈ గెలుపు అనంతరం గాయపడిన టీమిండియా హీరో రిషబ్ పంత్ స్పందించాడు. ఇన్స్టా వేదికగా భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. ఈ సిరీస్లో నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడి, ఐదో టెస్ట్కు దూరంగా ఉన్న పంత్.. టీమిండియా సాధించిన విజయాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. సహచరులను కొనియాడాడు. తన జట్టు పట్ల గర్వంగా ఉన్నానని అన్నాడు. దేశమే సర్వస్వమని తెలిపాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించేప్పుడు సర్వ శక్తులు ఒడ్డి పోరాడతామని అన్నాడు. దేనికి వెనుకాడేది లేదని స్పష్టం చేశాడు.
పంత్ మాటల్లో.. ఈ ఇంగ్లండ్ పర్యటన మా నుంచి చాలా అడిగింది. అంతకుమించి తిరిగి ఇచ్చింది. ఈ జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. యువ ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టుగా పోరాడిన తీరు అమోఘంగా ఉంది. దేశానికి ప్రాతినిథ్యం వహించడం మాకు సర్వస్వం. ఇది మాలోని ప్రతి విషయాన్ని వెలికి తీస్తుంది. దీనికి మేము గర్వపడుతున్నాము.
మా అద్భుతమైన సహాయక సిబ్బందికి, సిరీస్ ఆధ్యాంతం మాకు అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ జట్టు ఆకలితో ఉంది. ఐక్యంగా ఉంది. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది.
కాగా, ఈ సిరీస్లో రిషబ్ పంత్ టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో అతను అరివీర భయంకరమైన ఫామ్లో ఉండగా గాయపడ్డాడు. 7 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేశాడు.
నాలుగో టెస్ట్లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ చేయబోగా పంత్ పాదం ఫ్రాక్చర్‌కు గురైంది. పాదం ఫ్రాక్చర్ అయినా పంత్ ఆ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగి దేశానికి ఆడటమంటే తనకేంటో ప్రపంచం మొత్తానికి నిరూపించాడు. ఆ ఇన్నింగ్స్లో పంత్ కుంటుతూనే హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఓవల్ టెస్ట్లో విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.