
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుండె పగిలే వార్త తెలిసింది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ లీగ్ తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని స్టార్క్ స్వయంగా కన్ఫర్మ్ చేశాడు. భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా అందరూ విదేశీ ఆటగాళ్లతో పాటే స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్క్.. భారత్‌కు తిరిగి రావడం లేదని తేల్చి చెప్పాడు. దీనికి ఢిల్లీ యాజమాన్యం కూడా ఒప్పుకుంది.
ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న స్టార్క్ (11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు, ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా) లీగ్ కీలక దశలో హ్యాండ్ ఇవ్వడం ఢిల్లీ విజయావకాశాలను భారీగా దెబ్బ తీస్తుంది. స్టార్క్.. ఐపీఎల్ ముగిసిన తర్వాత వారం రోజుల్లో ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసమే భారత్‌కు తిరిగి రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా స్వదేశానికి వెళ్లి, తిరిగి రానని ప్రకటించిన రెండో ఆటగాడు స్టార్క్. స్టార్క్‌కు ముందు అతని దేశానికే (ఆస్ట్రేలియా) చెందిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ కూడా లీగ్ తదుపరి లెగ్ కోసం భారత్‌కు రానని స్పష్టం చేశాడు.
స్టార్క్ గురించి ముందుగానే సమాచారమున్న ఢిల్లీ యాజమాన్యం అతనికి ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్‌కు తాత్కాలిక రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసుకుంది. అయితే ప్రస్తుతం ముస్తాఫిజుర్ కూడా అందుబాటులోకి రావడం అనుమానంగా మారింది. ముస్తాఫిజుర్‌కు అతని దేశ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 6 విజయాలతో 13 పాయింట్లు (సన్‌రైజర్స్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఓ పాయింట్ లభించింది) సాధించి, పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
మే 18న గుజరాత్‌ను ఢీకొట్టనున్న ఈ జట్టు.. మే 21 ముంబైతో.. మే 24న పంజాబ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ.. గుజరాత్, పంజాబ్ చేతుల్లో ఓడి, ముంబై ఇండియన్స్ ఒక్కదానిపై గెలిచినా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి (ముంబై ఇండియన్స్ పంజాబ్ చేతుల్లో కూడా ఓడాల్సి ఉంటుంది).