
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తమ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ ఆల్ రౌండర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కార్స్ ఎడమ కాలికి గాయమైంది.
అయితే గాయం కాస్త తీవ్రమైనది కావడంతో ఈసీబీ వైద్య బృందం అతడికి విశ్రాంతి అవసరమని సూచించినట్ల తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్ధానాన్ని లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌తో ఇంగ్లండ్ క్రికెట్ భర్తీ చేసింది. "బ్రైడన్ కార్స్ మెకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
అతడి స్ధానంలో లీసెస్టర్‌షైర్, ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నామని" ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రెహాన్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో పాటే ఉన్నాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్‌బైగా ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పుడు కార్స్ దూరం కావడంతో ప్రధాన జట్టులో అహ్మద్‌కు చోటు దక్కింది. కాగా అహ్మద్‌కు అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాడు.
అతడిని జట్టులోకి తీసుకోవడం ఇంగ్లీష్ జట్టు స్పిన్ బలాన్ని పెంచుతుంది. ఇప్పటివరకు తీలయన్స్ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్ మాత్రమే ఉన్నాడు. అహ్మద్‌కు బ్యాట్‌తో రాణించే సత్తాకూడా ఉంది. రెహాన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 6 వన్డేలు ఆడి పది వికెట్లు పడగొట్టాడు.
కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బట్లర్ సేన తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 26న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఇంగ్లండ్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే అఫ్గాన్‌పై తప్పక గెలవాల్సిందే.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్
చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్