అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేని ఐసీసీ ఉనికిలో ఉండి లాభం లేదన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించాడు.
అతిపెద్ద మార్కెట్
క్రికెట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేయలేని ఐసీసీ తన కార్యకలాపాలు ఆపేస్తే మంచిదంటూ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) అతి చేశాడు. కాగా ప్రపంచంలోని క్రికెట్ బోర్డులన్నింటిలో బీసీసీఐ సంపన్న బోర్డు అన్న విషయం తెలిసిందే. భారత్‌లో మతంగా భావించే క్రికెట్‌కు ఉన్న ఆదరణే ఇందుకు కారణం.
ఐపీఎల్ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసీఐ ఆదాయం గణనీయంగా పెరిగింది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా బీసీసీఐకి ఐసీసీ నుంచి రెవెన్యూ భారీ మొత్తంలో అందుతుంది. ఇక ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్నారు.
శ్రీలంక క్రికెట్ జట్టుపై గతంలో ఉగ్రదాడి
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో ఇప్పటికే క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2009లో గడాఫీ స్టేడియం నుంచి శ్రీలంక క్రికెట్ జట్టు బస్సులో వెళ్తున్న వేళ 12 మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొంతమంది అధికారులు మరణించగా.. ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయాలపాలయ్యారు. కెప్టెన్ మహేళ జయవర్ధనే సహా కుమార్ సంగక్కర ఈ జాబితాలో ఉన్నారు.
పాకిస్తాన్‌కు చెందిన అహ్సాన్ రజా అనే అంపైర్ చచ్చిబతికాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం వరకు విదేశీ జట్లు అక్కడ పర్యటించలేదు. కొంతకాలం క్రితం నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక వంటి జట్లు మళ్లీ పాక్ పర్యటన మొదలుపెట్టాయి.
భద్రతా కారణాల దృష్ట్యా
ఇక దాయాది దేశంలో ఉగ్రదాడుల భయంతో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ టీమిండియాను అక్కడికి పంపడం లేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా అక్కడికి వెళ్లలేదు.
ఐసీసీ నిర్ణయంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడి ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు ఆతిథ్య పాక్ చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ టోర్నీలో పాక్ ఆటగాళ్లతో కరచాలనానికీ టీమిండియా నిరాకరించింది.
ఇదిలా ఉంటే.. తాజాగా బంగ్లాదేశ్ కూడా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వడం.. మైనారిటీలపై దాడులు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్‌ను తొలగించగా.. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్ అంటోంది. భద్రతా కారణాలు అంటూ ఓవరాక్షన్ చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు.
ఎలాంటి లాజిక్ లేదు.. కొంచమైనా బుద్ధి ఉందా?
‘‘ఐసీసీ నిర్ణయాలు తీసుకునేందుకు ఇండియన్ బోర్డుపై ఆధారపడితే.. దాని ఉనికి ఉండి కూడా వృథానే. పాకిస్తాన్‌లో ఆడేందుకు భారత జట్టును పంపకపోవడంలో ఎలాంటి లాజిక్ లేదు.
ఐసీసీ మాత్రం ఈ విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేసింది. భారతీయులు ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు’’ అని సయీద్ అజ్మల్ అన్నాడు. గతంలో శ్రీలంక జట్టుపై దాడి... తాజాగా భారత్‌లో పహల్గామ్ ఉగ్రదాడి వంటి ఘటనల తర్వాత కూడా అజ్మల్ టీమిండియా తమ దేశానికి రాకపోవడాన్ని ప్రస్తావించడాన్ని భారత జట్టు అభిమానులు తప్పుబడుతున్నారు. ‘కొంచమైనా బుద్ధి ఉందా?’’ అంటూ చురకలు అంటిస్తున్నారు.
చదవండి: భారత్‌పై నిందలు!.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ!


