
సుదీర్ఘ కాలంగా తనపై విమర్శలు చేసే ఇద్దరు భారత మాజీ కెప్టెన్ల వ్యాఖ్యలపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం కామెంటేటర్లుగా ఉన్న సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), రవిశాస్త్రి (Ravi Shastri) తనపై పదే పదే విమర్శలు చేసిన విషయాన్ని పరోక్షంగా గంభీర్ గుర్తు చేశాడు.
ఆ గాయం అంత పెద్దదేమీ కాదు
కాగా 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గంభీర్ తలకు తగిలిన గాయం ‘అంత పెద్దదేమీ కాదు’ అని రవిశాస్త్రి అప్పట్లో విమర్శించాడు. మరోవైపు.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచాక బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్‌మనీలో సహచర కోచింగ్ సిబ్బందికంటే గంభీర్ ఎక్కువ మొత్తం తీసుకోవడాన్ని గావస్కర్ ప్రశ్నించాడు.
ఇప్పుడు వీరిద్దరికి కలిపి గంభీర్ సమాధానమిచ్చాడు. ‘నేను కోచ్‌గా వచ్చి ఎనిమిది నెలలే అయింది. ఫలితాలు రాకపోతే విమర్శించే హక్కు అభిమానులకు ఉంది. కానీ 25 ఏళ్లుగా కామెంటరీ బాక్స్‌లో కూర్చున్నవారు భారత క్రికెట్‌ను తమ ఆస్తిగా భావిస్తున్నట్లున్నారు.
డబ్బులు ఇచ్చానా లేదా అనేది మీకెందుకు?
కానీ భారత్ క్రికెట్ వారిది కాదు.. 140 కోట్ల మంది భారతీయులది. వారు నా కోచింగ్‌ను, నా గాయాన్ని, చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీని కూడా ప్రశ్నించారు. నేను నిజానికి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరేవాళ్లకు డబ్బులు ఇచ్చానా లేదా అనేది వారికి అనవసరం.
నేనెంత డబ్బు ఖర్చుపెట్టాను.. ఎంత పెట్టుబడి పెట్టాను అన్న వివరాలు వారికెందుకు? అయినా నేనేమీ ఇక్కడ సంపాదించి విదేశాలకు వలసవెళ్లిపోలేదే? 180 రోజులు విదేశాల్లోనే గడపడం లేదే? నేను భారతీయుడిని.. పన్ను తప్పించుకునేందుకు ఎన్నారైగా మారటం లేదు. గాజు గృహాల్లో ఉండేవారు వేరేవాళ్ల మీద రాళ్లు విసరవద్దు’ అని గంభీర్ కౌంటర్ ఇచ్చాడు.
గంభీర్ మార్గదర్శనంలో
కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. గంభీర్ ఆ పదవిని చేపట్టాడు. అతడి మార్గదర్శనంలో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మెరుగ్గా రాణిస్తోంది.
టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా... దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి సత్తా చాటింది. ఈ క్రమంలో బీసీసీఐ రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు ప్రకటించింది.
ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్‌కోచ్ గంభీర్‌కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, గతంలో ద్రవిడ్ తాను ప్రత్యేకంగా ఎక్కువ ప్రైజ్‌మనీ తీసుకోకుండా.. సహాయక సిబ్బందికి సమానంగా పంచాడని గావస్కర్ గుర్తు చేశాడు.
ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా గంభీర్ మార్గదర్శనంలో దారుణంగా విఫలమవుతోంది. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్‌ట్రోఫీని చేజార్చుకుంది.
చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్