
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గ్రూప్-బిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ సెదిఖుల్లా అటల్ (95 బంతుల్లో 85; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (63 బంతుల్లో 67; ఫోర్, 5 సిక్సర్లు) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
సెదిఖుల్లా, ఒమర్‌జాయ్.. ఇబ్రహీం జద్రాన్ (22), రహ్మత్ షా (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), రషీద్ ఖాన్‌తో (19) కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆసీస్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్ (0), మహ్మద్ నబీ (1), గుల్బదిన్ నైబ్ (4), నూర్ అహ్మద్ (6) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిష్ 3, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపా తలో 2, ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ పడగొట్టారు.
274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలి ఓవర్ నుంచే ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఒమర్‌జాయ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఓ బౌండరీ బాదిన షార్ట్.. మూడో ఓవర్‌లో శివాలెత్తిపోయాడు. ఒమర్‌జాయ్ వేసిన ఈ ఓవర్‌లో షార్ట్ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాదాడు. ఫలితంగా ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి.
మరో ఎండ్‌లో విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా ఫజల్ హక్ ఫారూకీ బౌలింగ్‌లో బౌండరీ బాది మాంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. వీరిద్దరు రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా 3 ఓవర్లలో 32 పరుగులు చేసింది.
హెడ్ క్యాచ్ జారవిడిచిన రషీద్ ఖాన్
ఫజల్ హక్ ఫారూకీ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి డేంజరెస్ బ్యాటర్ ట్రవిస్ హెడ్‌ను ఔట్ చేసే సువర్ణావకాశాన్ని ఆఫ్ఘనిస్తాన్ చేజార్చుకుంది. హెడ్ మిడ్ ఆన్ దిశగా అందించిన క్యాచ్‌ను రషీద్ ఖాన్ జారవిడిచాడు. ఈ క్యాచ్ ఎంత మూల్యమైందో ఆఫ్ఘనిస్తాన్ కొద్ది సేపటిలోనే తెలిసింది. లైఫ్ లభించిన అనంతరం హెడ్ చెలరేగిపోయాడు. ఆతర్వాతి బంతికే సిక్సర్ బాదాడు. అదే ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టాడు. దీంతో 4 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ వికెట్ నష్టపోకుండా 42కు చేరింది.
సింపుల్ క్యాచ్‌ను జారవిడిచిన ఖరోటే
అనంతరం ఐదో ఓవర్ తొలి బంతికి ఆఫ్ఘనిస్తాన్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ ఖరోటే సింపుల్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఈ సారి మాథ్యూ షార్ట్‌కు లైఫ్ లభించింది. ఒమర్‌జాయ్ బౌలింగ్ షార్ట్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను ఖరేటో వదిలేశాడు. దీంతో 7 బంతుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు జారవిడిచినట్లైంది.
ఆఫ్ఘనిస్తాన్ ఊపిరిపీల్చుకుంది
ఖరోటే క్యాచ్ వదిలేశాక రెండు బంతులకే షార్ట్ ఔటయ్యాడు. ఒమర్‌జాయ్ బౌలింగ్‌లో గుల్బదిన్ క్యాచ్ పట్టడంతో షార్ట్ మెరుపు ఇన్నింగ్స్‌కు (15 బంతుల్లో 20; 3 ఫోర్లు, సిక్స్) తెరపడింది. దీంతో ఆఫ్ఘన్లు ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్‌కు ఔట్ చేసిన ఆనందం ఆఫ్ఘన్లకు ఎంతో సేపు మిగల్లేదు. స్టీవ్ స్మిత్ వచ్చీ రాగానే రెండు వరుసగా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఆసీస్ 5 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది.
మూల్యం చెల్లించుకుంటున్న ఆఫ్లన్లు
హెడ్ క్యాచ్‌ను జారవిడిచినందుకు ఆఫ్ఘన్లు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. లైఫ్ లభించాక హెడ్ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో 3 బౌండరీలు.. తొమ్మిదో ఓవర్‌లో హ్యాట్రిక్ బౌండరీలు సాధించి ఆఫ్ఘన్లను పశ్చాత్తాపపడేలా చేశాడు. అనంతరం హెడ్ నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్‌లో రెండు పరుగులు తీసి కెరీర్‌లో 17వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లలోనే ఆస్ట్రేలియా వికెట్ నష్టపోయి 100 పరుగుల మార్కును తాకింది.
ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆసీస్‌కు మాత్రం ఈక్వేషన్స్ అలా లేవు. ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఓడినా.. రేపు జరుగబోయే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సౌతాఫ్రికాను ఓడిస్తే సెమీస్‌కు చేరే అవకాశం (మెరుగైన రన్‌రేట్ కలిగి ఉంటే) ఉంటుంది.