కరీబియన్‌ లీగ్‌కు వేళాయె

Caribbean Premier League  Starts From Today - Sakshi

నేటి నుంచి టి20 వినోదం

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: క్రికెట్‌ అభిమానులకు నేటి నుంచి ధనాధన్‌ వినోదం లభించనుంది. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో వేదికగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ నేడు ప్రారంభంకానుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈసారి ఈ టోర్నీలోని మొత్తం 33 మ్యాచ్‌లను పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లోని బ్రియాన్‌ లారా స్టేడియం, క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానాల్లో మాత్రమే నిర్వహిస్తారు. మొత్తం ఆరు జట్లు (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, గయానా అమెజాన్‌ వారియర్స్, బార్బడోస్‌ ట్రైడెంట్స్, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్, జమైకా తలవాస్, సెయింట్‌ లూసియా జూక్స్‌) లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో తలపడనున్నాయి. లీగ్‌ దశ ముగిశాక టాప్‌–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లో ‘ఢీ’కొంటాయి. సెప్టెంబర్‌ 10న ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. 

భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే లీగ్‌ తొలి మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్టు ఆడుతుంది. ముంబైకి చెందిన 48 ఏళ్ల ప్రవీణ్‌ తాంబే ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇదే జట్టు తరఫున డ్వేన్‌ బ్రావో, డారెన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్, సునీల్‌ నరైన్, లెండిల్‌ సిమన్స్‌ (వెస్టిండీస్‌), కొలిన్‌ మున్రో (న్యూజిలాండ్‌), సికందర్‌ రజా (జింబాబ్వే) తదితరులు ఆడనున్నారు. ఇతర స్టార్‌ క్రికెటర్లు క్రిస్‌ లిన్‌ (ఆస్ట్రేలియా), రషీద్‌ ఖాన్, మొహమ్మద్‌ నబీ (అఫ్గానిస్తాన్‌), రాస్‌ టేలర్, సాన్‌ట్నెర్‌ (న్యూజిలాండ్‌) కూడా ఈ టోర్నీలో ఆడనున్నారు.

సీపీఎల్‌ టి20 టోర్నీ మ్యాచ్‌లను 
స్టార్‌ స్పోర్ట్స్‌–1, స్టార్‌ స్పోర్ట్స్‌–2 చానెల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.   

ఇక్కడ చదవండి: 
'పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇష్టపడతా'
‘ధోనితో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం’
వ్యాపారులకు ధోని పాఠాలివే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top