దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ కంటితుడుపు విజయాన్ని సాధించింది. నిన్న (జనవరి 22) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్ ఫలితం తేలిపోయింది. తొలి రెండు టీ20ల్లో గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో తలో పిడికెడు పరుగులు చేశారు. బ్రాండన్ కింగ్ 47, జాన్సన్ ఛార్లెస్ 17, కీసీ కార్తీ 10, జస్టిన్ గ్రీవ్స్ 12, షిమ్రోన్ హెట్‌మైర్ 13, క్వెన్టిన్ శాంప్సన్ 3, మాథ్యూ ఫోర్డ్ 27, షమార్ స్ప్రింగర్ 16 (నాటౌట్), మోటీ 2 (నాటౌట్) పరుగులు చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రహ్మాన్ షరీఫి, రషీద్ ఖాన్, అహ్మద్జాయ్ తలో 2 వికెట్లు తీయగా.. షాహిదుల్లా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్‌కు ఓపెనర్లు రహానుల్లా గుర్బాజ్ (71), ఇబ్రహీం జద్రాన్ (28) శుభారంభాన్ని అందించారు. అయితే వీరి తర్వాత వచ్చిన వారు ఒక్కరు కూడా క్రీజ్‌లో నిలబడలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది.
షమార్ స్ప్రింగర్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించాడు. షమార్ హ్యాట్రిక్ సహా 4 వికెట్లు, ఫోర్డ్, పియెర్రీ, సైమండ్స్ తలో వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్, జద్రాన్ మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు.


