ఇటీవలికాలంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వెస్టిండీస్‌కు వరుసగా షాకులిస్తుంది. తాజాగా అదే సీన్ రిపీటైంది.దుబాయ్ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జట్టు విండీస్‌పై 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది.
ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), దర్విష్ రసూలీ (59 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ అందించారు. వీరిద్దరూ చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. సెదిఖుల్లా అటల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ తీశారు.
అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. జియా ఉర్ రెహ్మాన్ (4-0-36-3), రషీద్ ఖాన్ (4-0-19-2), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (4-0-29-2), నూర్ అహ్మద్ (3-0-34-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది.
విండీస్ ఇన్నింగ్స్‌లో సాంప్సన్ (30) టాప్ స్కోరర్‌గా కాగా.. జాన్సన్ ఛార్లెస్ (27), మోటీ (28), ఫోర్డ్ (25) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటరల్లో ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్ చెరో 4, జాంగూ, హెట్‌మైర్, పియెర్రీ తలో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 రేపు (జనవరి 21) ఇదే వేదికగా జరుగనుంది.


