వ్యాపారులకు ధోని పాఠాలివే..

MS Dhoni SKills For Investors - Sakshi

న్యూఢిల్లీ: మహేంద్రసింగ్‌ ధోని.. ఎప్పటినుంచో తన  రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు ఆగస్టు 15, 2020(స్వాతంత్ర్య దినోత్సవం) శనివారం తెరదించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్‌కు గురి చేశాడు. అయితే కెప్టెన్‌గా మహేంద్రుడు చూపిన నైపుణ్యాలు వ్యాపారంలో పెట్టుబడుదారులు అనేక పాఠాలు నేర్చుకోవచ్చని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధోని నైపుణ్యాలలో ఆచరించదగ్గ ఐదు అంశాలు:

సహనం ఎంతో కీలకం:
ధోని అత్యుత్తమ నైపుణ్యాలలో అందరు పేర్కొంటున్న అంశం సహనం. క్రికెట్‌లో ఎంత సంక్లిష్ట పరిస్థితినైనా సహనంతో ధోనీ ఎదుర్కొనే తీరు ఆశ్చర్యపరుస్తుంది. అదే విధంగా స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు వచ్చాయని, అనూహ్య పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయినప్పుడు కానీ, విచారించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నైపుణ్యాలు పెంచుకొని ముందుకెళ్లడమే అత్యుత్తమ మార్గమని, ధోని నైపుణ్యాల ద్వారా వాటిని ఆచరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పట్టుదలే విజయ మార్గం
ధోని ప్రారంభ మ్యాచ్‌(2004-05)లో డకౌట్‌తో (పరుగులు చేయకుండా) అరంగేట్రం చేసినా, ఆ ప్రదర్శన అతనిని ఏ మాత్రం నిరుత్సాహ పరచలేదు. అదేవిధంగా ఊహించని పరిస్థతుల్లో పెట్టుబడిదారులకు విపరీతమైన నష్టం వస్తోంది. వీరంతా ధోని ప్రదర్శించిన పోరాట పటిమను అలవర్చుకొని తిరిగి లాభాలలో దూసుకెళ్లాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నమ్మకమే జీవితం
క్రికెట్‌ అభిమానులను ఎంతో అలరించిన 2007 సంవత్సరం టీ 20 ప్రపంచ కప్‌లో ధోని విభిన్న నైపుణ్యాలు గమనించవచ్చు.   టీ 20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ధోని చివరి ఓవర్‌ జోగిందర్‌ శర్మాకు ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.ఆ ఓవర్‌లో జోగిందర్‌ రాణించడంతో ధోని నమ్మకం ఎంత బలీయమైనదో ప్రపంచానికి తెలిసింది. అదే విధంగా పెట్టుబడులు పెట్టే ముందు అన్ని అంశాలను అవగాహన చేసుకొని పెట్టుబడులు పెట్టాలని, అవసరమైతే మార్కెట్‌ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.

బలాలను గుర్తించండి
ధోనికి తన బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఎంత క్లిష్ట పరిస్థితినైనా ధోని ఎదుర్కొంటాడని, ధోని పోరాట యోధుడని దిగ్గజ మాజీ ఆసీస్‌ ఆటగాడు మైకేల్‌ హస్సీ గతంలో కితాబిచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా బడ్డెట్‌, ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడుల వ్యూహాలు ధోనీ ఆచరించిన విధానాలతో  అవగాహన చేసుకుంటే పెట్టుబడిదారులకు ఎంతో ఉపయోగపడతాయి.

కోచ్‌ ప్రాముఖ్యత
ధోనికి స్కూల్‌ చదివే రోజులలో ఫుట్‌బాల్‌పైనే ఆసక్తి ఉండేది. అయితే కోచ్‌ కేశవ్‌ బెనర్జీ ధోని నైపుణ్యాలను గమనించి క్రికెట్‌కు పరిచయం చేశాడు. అయితే మార్కెట్‌, పెట్టుబడి రంగంలో విజయం సాధించాలంటే ఆర్థిక సలహాదారుల పాత్ర ఎంతో కీలకం. క్రికెట్‌లో ధోనీకి కోచ్‌ ఎలాంటి పాత్ర పోషించారో,పెట్టుబడిదారులకు ఆర్థిక సలహాదారలు అలాంటే పాత్ర పోషిస్తేనే పెట్టుబడిదారులు విజయం సాధిస్తారని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి: ధోని రికార్డును ఏ కెప్టెన్‌ బ్రేక్‌ చేయలేరు: గౌతమ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top