
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తీరుపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. శ్రేయస్ చెప్పే సాకులు తన ఊహకు కూడా అందడం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.
వన్డే ఫార్మాట్లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత ఐపీఎల్-2025 (IPL)లోనూ సత్తా చాటాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అంతకుముందు దేశీ క్రికెట్‌లోనూ రాణించాడు.
కెప్టెన్సీ వదులుకోవడంతో పాటు...
అయినప్పటికీ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup 2025) జట్టుకు సెలక్టర్లు శ్రేయస్‌ను ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఆస్ట్రేలియా-‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌కు అతడిని భారత్-‘ఎ’ కెప్టెన్‌గా సెలక్ట్ చేశారు. ఈ క్రమంలో తొలి టెస్టు ఆడి విఫలమైన శ్రేయస్.. రెండో టెస్టు ఆరంభానికి ముందే కెప్టెన్సీ వదులుకోవడంతో పాటు జట్టు నుంచీ తప్పుకొన్నాడు.
ఆరు నెలల విరామం
వెన్నునొప్పి కారణాంగా నాలుగు రోజుల పాటు ఫీల్డింగ్ చేయలేకపోతున్నానంటూ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఆరు నెలలపాటు రెడ్‌బాల్ క్రికెట్‌కు విరామం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు.
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్
ఈ విషయాన్ని ధ్రువీకరించిన బోర్డు.. ఆసీస్-ఎ జట్టుతో వన్డేలకు అతడిని సారథిగా నియమించింది. అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా శ్రేయస్‌ను ఎంపిక చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ శ్రేయస్ అయ్యర్ తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘నిజం చెప్పాలంటే.. శ్రేయస్ అయ్యర్ చేసిన పని నన్ను సందిగ్దంలోకి నెట్టేసింది.
ఊహకు కూడా అందడం లేదు
రెడ్‌బాల్ క్రికెట్‌కు తాను అన్‌ఫిట్ అని శ్రేయస్ స్వయంగా చెప్పాడు. అయితే, వైట్‌బాల్ క్రికెట్ ఆడేందుకు మాత్రం ఫిట్‌గా ఉన్నానన్నాడు. రెడ్‌బాల్, వైట్‌బాల్ క్రికెట్ల మధ్య అంతరం ఏమిటో నాకైతే అర్థంకావడం లేదు.
ఒకవేళ ఒక ఆటగాడు వైట్‌బాల్ క్రికెట్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడంటే.. రెడ్‌బాల్ క్రికెట్‌కు కూడా సిద్ధంగా ఉండాలి కదా!.. ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవడం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. నా ఊహకు కూడా అందడం లేదు’’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ మిడ్-డేతో పేర్కొన్నాడు.