
మహారాష్ట్ర బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) అద్బుత శతకంతో మెరిశాడు. 140 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ముంబైతో వార్మప్ మ్యాచ్ (రెడ్‌బాల్) సందర్భంగా పృథ్వీ ఈ మేరకు రాణించాడు.
కాగా ముంబై తరఫున దేశీ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో సారథిగా భారత్‌కు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఫిట్‌నెస్‌లేమి, క్రమశిక్షణారాహిత్యం, ఫామ్‌లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.
ముంబైని వీడి మహారాష్ట్రకు
ఇక గతేడాది ముంబై రంజీ జట్టు (Ranji Team)లోనూ పృథ్వీకి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో 2025-26 సీజన్‌లో మహారాష్ట్రకు ఆడేందుకు.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ముంబై (Mumbai Cricket Team) జట్టును వీడాడు. ఇక త్వరలోనే రంజీ ట్రోఫీ తాజా సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో మహారాష్ట్ర- ముంబై జట్లు అక్టోబరు 7-9 మధ్య ఎంసీఏ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ ఆడుతున్నాయి.
భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా
ఈ క్రమంలో మంగళవారం నాటి తొలిరోజు ఆట సందర్భంగా పృథ్వీ షా సెంచరీ సాధించాడు. ముంబై రంజీ జట్టు కొత్త కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి వంద పరుగులు పూర్తి చేసుకున్న పృథ్వీ.. మొత్తంగా 181 పరుగులు సాధించి అవుటయ్యాడు. అర్షిన్ కులకర్ణితో కలిసి 305 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. షామ్స్ ములానీ బౌలింగ్‌లో పృథ్వీ షా నిష్క్రమించాడు.
కాగా 25 ఏళ్ల పృథ్వీ షా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటికి 58 మ్యాచ్‌లు ఆడి సగటు 46.02తో 4556 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 379. ఇదిలా ఉంటే.. అక్టోబరు 15న కేరళతో మ్యాచ్ సందర్భంగా మహారాష్ట్ర జట్టు తాజా రంజీ ఎడిషన్‌లో తమ ప్రయాణం ఆరంభించనుంది. తదుపరి సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్ జట్లతో మహారాష్ట్ర టీమ్ తలపడనుంది.
మహారాష్ట్ర రంజీ జట్టు
పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణి, సిద్ధేష్ వీర్, రుతురాజ్ గైక్వాడ్, అంకిత్ బవానే (కెప్టెన్), సౌరభ్ నవలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ ధాడే, హితేష్ వాలుంజ్, మందార్ భండారి (వికెట్ కీపర్), హర్షల్ కేట్, సిద్ధార్థ్ మాత్రే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, రజ్‌నీశ్ గుర్బానీ.
ముంబై రంజీ జట్టు
శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), ముషీర్ ఖాన్, అఖిల్ హెర్వాడ్కర్, సువేద్ పార్కర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాష్ ఆనంద్, హార్దిక్ తమోర్, షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, హిమాన్షు సింగ్, తుషార్ దేశ్‌పాండే, ఇర్ఫాన్ ఉమైర్, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్.
చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్