Viral Video: సూపర్‌ మ్యాన్‌లా స్టోక్స్‌.. కళ్లు చెదిరే విన్యాసానికి నెటిజన్లు ఫిదా  

Ben Stokes Saves Six With Outrageous Fielding On Boundary Rope In 2nd T20I Vs Australia - Sakshi

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్‌ 12) జరిగిన రెండో టీ20లో ఓ అద్భుత విన్యాసం ఆవిష్కృతమైంది. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ బౌండరీ లైన్‌ వద్ద సూపర్‌ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి తన జట్టుకు నాలుగు పరుగులు ఆదా చేశాడు. బెన్‌ స్టోక్స్‌ చేసిన ఈ విన్యాసం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. సిక్సర్‌ సేవ్‌ చేయాలన్న స్టోక్స్‌ అంకితభావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారెవ్వా స్టోక్స్‌ అంటూ కితాబునిస్తున్నారు. స్టోక్స్‌పై ప్రశంసలతో ట్విటర్‌ హోరెత్తుతుంది.

ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా చలామణి అవుతున్న బెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ తానే బెస్ట్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇవాళ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో మెప్పించలేకపోయిన స్టోక్స్‌ (11 బంతుల్లో 7).. బౌలింగ్‌ (1/10), ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా స్టోక్స్‌ ఇవాళ ఫీల్డ్‌లో పాదరసంలా కదిలాడు. తాను చేసిన పరుగుల కంటే ఎక్కువగా సేవ్‌ చేశాడు.

సామ్‌ కర్రన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో మిచెల్‌ మార్ష్‌ భారీ షాట్‌ ఆడాడు. ఆ షాట్‌ తప్పక బౌండరీ ఆవల (సిక్స్‌) పడుతుందని బౌలర్‌తో పాటు అంతా ఫిక్స్‌ అయ్యారు. క్రీజ్‌లో ఉన్న బ్యాటర్లు సైతం ఇలాగే అనుకుని పరుగు తీయడం కూడా మానుకున్నారు. ఈ లోపు బౌండరీ లైన్‌ వద్ద స్టోక్స్‌ పక్షిలా గాల్లోకి ఎగిరి రోప్‌ బయట పడాల్సిన బంతిని లోపలికి నెట్టేశాడు. కళ్లు చెదిరే ఈ విన్యాసం చూసి గ్రౌండ్‌లో ఉన్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. ఈలోపు క్రీజ్‌లో ఉన్న బ్యాటర్లు స్టోక్స్‌ విన్యాసం చూసిన షాక్‌లోనే రెండు పరుగులు పూర్తి చేశారు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇదిలా ఉంటే, కాన్‌బెర్రా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్‌.. ఆసీస్‌పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో ఆసీస్‌ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో (170) నిలిచిపోయింది.

ఇంగ్లండ్‌ బ్యాటర్లు డేవిడ్‌ మలాన్‌ (48 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), మొయిన్‌ అలీ (27 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించగా.. ఛేదనలో మిచెల్‌ మార్ష్‌ (29 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (23 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్‌) ఆసీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top