
లార్డ్స్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో విజయం ఆఖరికి ఇంగ్లండ్‌ను వరించింది. ఇంగ్లండ్ గెలుపులో ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ది కీలక పాత్ర. స్టోక్సీ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.
ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి బ్యాటింగ్‌లో 77 పరుగులు చేసిన స్టోక్స్.. బౌలింగ్‌లో 5 కీలక వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం(టెస్టు క్రికెట్)లో నాలుగు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా స్టోక్స్ నిలిచాడు.
ఈ మ్యాచ్ ముందు వరకు స్టోక్స్.. జో రూట్ (ఇంగ్లండ్), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)లతో కలిసి చెరో మూడేసి అవార్డులతో సంయుక్తంగా ఉన్నాడు. తాజా మ్యాచ్‌తో ఈ దిగ్గజ త్రయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ అధిగమించాడు.
స్టోక్స్ తొలిసారిగా 2015లో లార్డ్స్ మైదానంలో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత 2017,2019లో ఈ అవార్డు అతడికి వరించింది. మళ్లీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ఐకానిక్ గ్రౌండ్‌లో ప్లేయర్‌గా ఆఫ్‌ది మ్యాచ్‌గా స్టోక్స్ నిలిచాడు.
ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుందిఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి లైమ్ డాసన్ వచ్చాడు. భారత్ కూడా తమ తుది జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.
చదవండి: భారత్ ఓటమికి కారణమదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గవాస్కర్